ముఖం చాటేసిన బాబు | Sakshi
Sakshi News home page

ముఖం చాటేసిన బాబు

Published Fri, Apr 12 2019 4:53 AM

Chandrababu did not speak to Media After Polling Because Of Defeat Fear - Sakshi

సాక్షి, అమరావతి: పోలింగ్‌ జరుగుతున్నంతసేపు ఆరోపణలు, విమర్శలతో హడావుడి చేసిన సీఎం చంద్రబాబు గురువారం పోలింగ్‌ ముగిసిన తర్వాత మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. గురువారం రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు అందరికీ సమాచారమిచ్చినా వెంటనే దాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఇంకా అమల్లో ఉంది కాబట్టి మాట్లాడితే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందని మాట్లాడలేదంటూ టీడీపీ వర్గాలు సమాధానమివ్వడం గమనార్హం.

ఎన్నికల నియమావళిని అడుగడుగునా తుంగలో తొక్కుతూ గురువారం పలు పత్రికా ప్రకటనలు, వీడియోలను చంద్రబాబు విడుదల చేశారు. బుధవారం ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదినే బెదిరించిన ఆయన సీఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి ఎన్నికల నియమావళి తనకు వర్తించదనే రీతిలో వ్యవహరించడం తెలిసిందే. అంతేగాక రాష్ట్ర సీఈవో కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రోజూ దాన్ని యధేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు పోలింగ్‌ ముగింపు దశలో మీడియాతో మాట్లాడేందుకు రాకపోవడానికి కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికి మీడియా సమావేశాలు నిర్వహించడం, అవసరమున్నా లేకపోయినా చిట్‌ఛాట్‌లు చేయడం, లీకులివ్వడం ఆయనకు అలవాటైన వ్యవహారం.

ఇంతచేసే చంద్రబాబు పోలింగ్‌ ముగిశాక ఎందుకు మీడియాతో మాట్లాడడానికి రాలేదనే దానిపై ఆయన పక్కనుండేవారే సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జోరు మీద ఉన్నట్లు స్పష్టమవడంతోనే ఆయన ముఖం చాటేసినట్లు సమాచారం. మీడియా ముందుకొచ్చినా కొత్తగా చెప్పే విషయాలేవీ లేకపోవడం, గెలుపుపై భరోసా లేకపోవడంతో ఆయన మిన్నకుండి పోయినట్లు చర్చించుకుంటున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement