బాబు.. ముఖం చాటేశారు.. | Sakshi
Sakshi News home page

బాబు.. ముఖం చాటేశారు..

Published Wed, Dec 18 2013 12:55 AM

బాబు.. ముఖం చాటేశారు.. - Sakshi

  • బీఏసీ భేటీకి టీడీపీ అధినేత డుమ్మా
  •   ఇరు ప్రాంతాల నేతలను పంపి ఎవరి వాదన వారు చెప్పుకోవాలని ఆదేశం
  •   బీఏసీ భేటీ అనంతరం ఇరుప్రాంతాల
  •   నాయకులతో చంద్రబాబు భేటీ..
  •   అసెంబ్లీ చర్చలోనూ ఎవరి వాదన వారు వినిపించుకోవాలని సూచన 
రాష్ట్ర విభజన అంశంపై తన వైఖరిని స్పష్టంగా చెప్పలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి డుమ్మా కొట్టారు. ఉదయం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికి బాబు వచ్చారు. సభ బుధవారానికి వాయిదా పడిన తరువాత కూడా రెండు గంటల పాటు అసెంబ్లీలోని తన చాంబర్‌లోనే ఉన్న బాబు.. బీఏసీ సమావేశానికి మాత్రం వెళ్లలేదు. పైగా.. ఈ భేటీలో ఎవరి వాదనలు వారు చెప్పుకోవాలంటూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమనాయుడులను పంపించారు. విభజన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రోజు నుంచి ప్రతి రోజూ సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహిస్తూ బిల్లును విమర్శిస్తున్న చంద్రబాబు.. దానిపై శాసనసభలో అజెండాను ఖరారు చేయటానికి ఉద్దేశించిన బీఏసీ సమావేశానికి మాత్రం వెళ్లకపోవడం విశేషం.
 
గత బుధవారం జరిగిన బీఏసీ భేటీకి కూడా చంద్రబాబు హాజరుకాకపోవడం గమనార్హం. సోమవారం శాసనసభలో విభజన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కూడా చంద్రబాబు గైర్హాజరైన విషయం తెలిసిందే. బీఏసీ సమావేశం మంగళవారం జరగనుందని ముందే తెలిసినా.. చంద్రబాబు మాత్రం దానికి హాజరుకాలేదు. హాజరైతే ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుందని, తద్వారా ప్రజల్లో మరింత చులకన అవుతానన్న ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరిగింది. ఇలావుండగా, బీఏసీకి హాజరైన పార్టీలన్నీ తమ వైఖరిని స్పష్టంగా చెప్పాయి. టీడీపీ మాత్రం అన్ని పార్టీలకు భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందులో పాల్గొన్న టీడీపీ నేతలు ఇద్దరూ ఎవరి వైఖరి వారు చె ప్పుకున్నారు. రాష్ర్ట హక్కులను హరిస్తున్న బిల్లును వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలన్న ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్‌ను మోత్కుపల్లి తప్పుపట్టారు.
 
తాము నాలుగున్నరేళ్లుగా తెలంగాణకు అనుకూలంగా సభలో తీర్మానం చేయమంటే స్పందించలేదని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి బిల్లును పంపితే.. దాన్ని వెనక్కు పంపమనటం సరికాదన్నారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించటం మంచిది కాదన్నారు. వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. వీరు ఇలా వాదులాడుకుంటున్న సమయంలో జోక్యం చేసుకున్న హరీష్‌రావు మీరు పార్టీ తరఫున బీఏసీకి వచ్చారా లేక వ్యక్తిగ తంగా హాజరయ్యారా అని ప్రశ్నించారు. ఆ తరువాత తన డిమాండ్‌ను  అంగీకరించకపోవటంతో వాకౌట్ చేస్తున్నట్టు ముద్దుకృష్టమనాయుడు ప్రకటించారు. టీడీపీ ప్రతినిధిగా హాజరైన ఆయన వ్యక్తిగత హోదాలో సమావేశం నుంచి వాకౌట్ చేశానని మీడియాకు చెప్పారు. మరో నేత మోత్కుపల్లి బీఏసీలో ఏం చెప్పారని ప్రశ్నించగా ‘ఆయన్నే అడగండి. నన్ను ఎందుకు అడుగుతారు’ అన్నారు.
 
సమావేశం ముగిసిన తరువాత  మోత్కుపల్లి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిల్లుపై చర్చ జరపాలన్న తన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. బీఏసీ భేటీ తరువాత ఇరువురు నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారిద్దరిని చంద్రబాబు ఎవరి వాదనలు వారు సమర్ధవంతంగా వినిపించారంటూ అభినందించారు. ఆ తరువాత బుధవారం నుంచి సభలో జరిగే చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఇరు ప్రాంతాల నేతలతో సమావేశమై చంద్రబాబు చర్చించారు. ఎవరి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వాదనలు వినిపించుకోవాలని, అందుకు అవసరమైన వివరాలను పార్టీ కార్యాలయం అందిస్తుందని తెలిపారు. బిల్లుపై చర్చలో పార్టీ అధినేతతో పాటు పార్టీ నేతలు మాట్లాడే సమయంలో సంయమనంతో వ్యవహరించాలని మిగిలిన వారు మాట్లాడేటపుడు అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.

Advertisement
Advertisement