బాబుకు మరో షాక్ ! | Sakshi
Sakshi News home page

బాబుకు మరో షాక్ !

Published Tue, Feb 18 2014 2:57 AM

Chandrababu Naidu Another shock

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి విజయనగరం జిల్లా నేతలు  తలనొప్పిగా మారారు. కేటాయించిన టిక్కెట్లు వద్దని తమకు కావలసిన స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కొత్తసమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే గుమ్మడి సంధ్యారాణికి అరకు ఎంపీటిక్కెట్ కేటాయించగా ఆమె అంగీకరించకపోవడంతో ఆ స్థానాన్ని శోభా హైమావతి కుమార్తెకు కేటాయించారు. ఇప్పుడు తాజాగా అశోక్ ఎమ్మెల్యేగా పోటీచేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా నేతలు బాబుకు మరో షాక్ ఇచ్చారు. అశోక్‌ను ఎంపీగా పోటీచేయించాలని భావించిన  అధినేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ నేతను ఎంపీగా పోటీ చేయించి, కొత్తవారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామంటే తాము అంగీకరించబోమని పలువురు ‘దేశం’తమ్ముళ్లు సోమవారం జరిగిన సభలో స్పష్టం చేశారు. దీంతో చాలా మంది నాయకులు అవాక్కయ్యారు.
 
 ఎంపీ అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని విజయనగరం నియోజకవర్గ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు మళ్లీ ఎమ్మెల్యేగానే  పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేయడం తమకిష్టం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఇదే విషయమై అశోక్ బంగ్లాలో సోమవారం వాదోపవాదాలు జరిగాయి. తమ నేత ను ఎంపీగా పోటీ చేయించి, మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారని జిల్లా స్థాయి నేతల్ని ప్రశ్నించారు. తాము ఒప్పుకోమని, అశోక్ గజపతిరాజు కూడా అధిష్టానం వద్ద అయిష్టత తెలియజేయాల్సిన అవసరం ఉందని వారు కరాఖండీగా చెప్పారు.
 
 అశోక్ బంగ్లాలో సోమవారం జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. ప్రజాగర్జనలో భాగంగా జిల్లాకొస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు, భారీ ఎత్తున సభ నిర్వహించే ఏర్పాట్ల విషయమై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పూసపాటి అశోక్ గజపతిరాజు, కోళ్ల లలితకుమారితో పాటు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమవతి కూడా పాల్గొన్నారు. సమావేశం చివరిలో ఈసారి ఎంపీగా అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారని పార్టీ నాయకులు ప్రకటించారు. దీంతో శో భా హైమవతి, గుమ్మడి సంధ్యారాణి తదితర నేతలు పుష్పగుచ్ఛం ఇచ్చి అశోక్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ తంతు పూర్తవగానే అశోక్ గజ పతిరాజు తన నివాసంలోకి వెళ్లిపోయారు. ఇంతలో విజయనగరం నియోజకవర్గ నాయకులు జోక్యం చేసుకుని పుష్ప గుచ్చాలు ఎందుకిచ్చారు? మా నేతను ఎంపీగా పోటీ చేయించాలన్న ఉత్సాహం ఎందుకు? మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారని? వాదనకు దిగారు. 
 
 ఇన్నాళ్లూ కష్టపడిన వారి 
 గతేమిటి....?
 అశోక్ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని, ఒకవేళ కాదూకూడదంటే ఎమ్మెల్యేగా ఎవర్ని నిలబెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.కొత్తగా వచ్చే నేతతో ఇబ్బందులొస్తాయని, ఇన్నాళ్లూ కష్టపడి పని చేసిన నాయకులు ఏమవుతారని, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తే పాత వారంతా ఏం చేయాలని  నిలదీస్తూ మాట్లాడారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ జోక్యం చేసుకుని అధిష్టానం ఏ నిర్ణ యం తీసుకుంటే దాని ప్రకారం నడుచుకుందామని విజయనగరం నియోజకవర్గ నాయకులకు సర్ది చెప్పారు. 
 
 అయినప్పటికీ నియోజకవర్గ నాయ కులంతా ఒకచోట సమావేశమై అశోక్ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని, ఆ మేరకు వత్తిడి తీసుకురావాలన్న అభిప్రాయానికొచ్చారు. అంతేకాకుండా కొత్తగా వచ్చే నేతకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని, ఒకవేళ అశోక్ కాకపోతే  సీనియర్‌గా ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వాలని ప్రసాదుల రామకృష్ణ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదంతా చూస్తుంటే పార్టీలోకి చేరాలనుకుంటున్న మీసాల గీతకు చెక్ పెట్టేలా పార్టీ శ్రేణులు ఉన్నట్టు స్పష్టమవుతోంది. అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తమకు తోచినవిధంగా ఎన్నికల్లో పని చేయాలన్న యోచనలో ఉన్నారు.  
 

Advertisement
Advertisement