డ్వాక్రా మహిళలకు మరోసారి మోసం | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళలకు మరోసారి మోసం

Published Thu, Jan 31 2019 7:46 AM

Chandrababu Naidu Cheat Dwcra Womens - Sakshi

సాక్షి, విశాఖపట్నం: డ్వాక్రా మహిళలను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్‌ సీపీ మహిళా సదస్సు ఇన్‌చార్జి విజయసారథి రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు గడిచినా హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చి మహిళలకు స్వర్ణయుగం తెస్తానంటే చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ నగర, విశాఖ పార్లమెంట్‌ మహిళా అధ్యక్షులు గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ ప్రధాన కార్యలయంలో మహిళా సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విజయ సారథిరెడ్డి, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరదు కల్యాణి హాజరయ్యారు. ముందుగా నవరత్నాలు అమలు చేస్తే కలిగే ప్రయోజనాలను ఎల్‌సీడీ స్క్రీన్‌ ద్వారా మహిళలకు వివరించారు. అనంతరం విజయసారథి రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వాటితో కలిగే ప్రయోజనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

జిల్లాలోని ప్రతీ గ్రామంలో పర్యటించి నవరత్నాలతో మహిళలకు కలిగే లబ్ధిని వివరించాలన్నారు. అబద్ధపు హామీలతో మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్న వైనాన్ని కూడా అందరికీ తెలియజేయాలన్నారు. అనంతరం వరదు కల్యాణి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ మూడు నెలలూ చాలా కీలకమన్నారు. మహిళా కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామన్నారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి నవరత్నాలను తీసుకెళ్లడానికి కృషి చేయాలన్నారు. మహిళలను మభ్యపెట్టడానికే పసుపు – కుంకుమ పేరుతో మరో మోసానికి చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. విశాఖ నగరంలో నిర్వహించిన సమావేశంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10వేలు చొప్పున ఇస్తామని ఆశ కల్పించి వాటర్‌ ప్యాకెట్‌లతో టీడీపీ నాయకులు సరిపెట్టారని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వడ్డీ కూడా చెల్లించకుండా అక్కాచెల్లమ్మలు ఎదురుచూస్తున్నారన్నారు. గరికిన గౌరి మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను కాపీ కొట్టి మహిళల ఓట్లు దండుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మరో రెండు నెలల్లో రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు ఎత్తుగడలను తిప్పికొడతారన్నారు. సదస్సులో విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు, గాజువాక, భీమిలి నియోజకవరగ్గాల మహిళా విభాగం అధ్యక్షులు సాడి పద్మారెడ్డి, మళ్ల ధనలత, సభీర, కృప, చినతల్లి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శ్రీదేవివర్మ, శిరీష, అనుబంధ విభాగాల అధ్యక్షులు యువశ్రీ, రామలక్ష్మి, నిర్మలారెడ్డి, అమృతవలి, శోభ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement