రుణమాఫీ ఉచ్చులో రైతులు | Sakshi
Sakshi News home page

మాఫీ.. మాయ!

Published Wed, Feb 20 2019 12:32 PM

Chandrababu naidu Cheat Farmers With Loan Waiver Promise - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌/శింగనమల: రుణమాఫీ హామీ మాయలో రైతులు ఓడిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో పరపతి కోల్పోయారు. ఎన్నికల ముందు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న బాబు.. ఆ తర్వాత మాట మార్చి సవాలక్ష నిబంధనలతో నాలుగున్నరేళ్లు దాటినా అరకొర మాఫీతో చుక్కలు చూపుతున్నాడు. రుణమాఫీ మాయలో 2014 సంవత్సరంలో దాదాపుగా రూ.4 వేల కోట్ల రుణాల రెన్యూవల్‌కు బ్రేక్‌పడింది. అదే సంవత్సరం ఖరీఫ్‌లో వేరుశనగతో పాటు ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పంట రుణాల రెన్యూవల్‌ జరగకపోవడంతో వాతావారణ బీమా కింద ప్రీమియం చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో రూ.500 కోట్ల వరకు రావాల్సిన వాతావరణ బీమా పరిహారం లభించక రైతులకు తీరని అన్యాయం జరిగింది. మొత్తం మీద అస్తవ్యస్త రుణమాఫీతో రైతులు గత నాలుగన్నరేళ్లుగా పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అసలెంతో.. వడ్డీ ఎంతో.. మాఫీ అయినదెంతో ఇప్పటికీ అర్థంకాక సతమతమవుతున్నారు. ఇలా రుణమాఫీ మాయతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. చెప్పిన దానికి.. చేసిన దానికీ పొంతన లేకపోవడంతో లక్షలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

కాలయాపన.. కొర్రీలు
ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 2013 డిసెంబర్‌ నాటికి అన్ని రకాల వ్యవసాయ రుణాలు 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817 కోట్లు. ఇందులో పంట రుణాలు 6.08 లక్షల ఖాతాల పరిధిలో రూ.3,093 కోట్లు, బంగారు నగల తాకట్టుపై 2.12 లక్షల ఖాతాల పరిధిలో రూ.1,851 కోట్లు, వ్యవసాయ అనుబంధ టర్మ్‌లోన్లు 2.03 లక్షల ఖాతాల పరిధిలో 1,873 కోట్లు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇవన్నీ బేషరతుగా మాఫీ చేయాలి. కానీ అలా చేయలేదు. కమిటీలు, నిబంధనలు, షరతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేసి మాఫీ సొమ్ముపై కొర్రీలు వేశారు. తర్వాత చెప్పినట్లుగా పంట రుణాలు, బంగారు నగల రుణాలు తీసుకున్నా.. దాదాపు రూ.4,955 కోట్లు మాఫీ చేయాల్సి ఉండేది. అది కూడా చేయకుండా.. చివరకు రూ.2,744 కోట్లకు కుదించారు. అదైనా ఒకేసారి చేశారా అంటే.. చేతులెత్తేశారు. విడతల వారీగా అంటూ రుణమాఫీ పత్రాలతో మాయ చేశారు. ఇవన్నీ చూసి రైతులు కంగుతిన్నారు. మాఫీ కోసం బ్యాంకులు, వ్యవసాయ శాఖ, కలెక్టరేట్‌ కార్యాలయాలు తిరిగి తిరిగి అలసిపోయారు. ఇక్కడ పరిష్కారం కాకుంటే ఏకంగా హైదరాబాద్, గుంటూరు వెళ్లి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయాలు, రుణమాఫీకి ఇన్‌చార్జిగా వ్యవహరించిన కుటుంబరావును కలిసి ఫిర్యాదులు సమర్పించారు. ఇందుకోసం రోజుల తరబడి పనులు మానేసి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా చాలా మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు అరకొర మాఫీకి నోచుకున్నారు.

రూ.2,744 కోట్ల మాఫీ ఇలా..
అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఎట్టకేలకు రూ.2,744 కోట్లు మాఫీకి అర్హత ఉన్నట్లు తేల్చారు. అందులో మొదటి విడతగా 2.6 లక్షల మంది రైతులకు రూ.650 కోట్లు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద మాఫీ చేయగా, మరో 5.5 లక్షల మంది రైతులకు రూ.418 కోట్లు ఇచ్చారు. ఇక రెండో విడతగా 5.5 లక్షల అకౌంట్లకు రూ.460.90 కోట్లు విడుదల చేయగా.. ఇందులో ఇంకా రూ.10.18 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇక మూడో విడత కింద 5.5 లక్షల అకౌంట్లకు రూ.502.80 కోట్లు విడుదల చేయగా అందులో కూడా ఇంకా రూ.22.72 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇలా రెండు, మూడు విడతల కింద రైతులకు రూ.32.90 కోట్లు రావాల్సి ఉంది. ఇవి కాకుండా నాలుగో విడతగా రూ.544.70 కోట్లు, ఐదో విడత కింద రూ.586.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇలా మొత్తంగా రూ.1,164.20 కోట్ల మాఫీ సొమ్ము విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిగో అదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తున్నా అతీగతీ లేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండంతో ఇప్పుడు నగదు కాకుండా చెక్కుల రూపంలో రైతులను బురిడీ కొట్టించే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీ పరిస్థితి ఇలా..
మాఫీకి అర్హత కలిగిన పంట రుణాల మొత్తం    : 2,744 కోట్లు
అర్హత పొందిన రైతుల అకౌంట్లు    : 8.10 లక్షలు
ఒకేసారి మాఫీ అయిన మొత్తం    : 650 కోట్లు
మొదటి విడతగా మాఫీ అయిన మొత్తం    : 418 కోట్లు
రెండో విడత మాఫీ అయిన మొత్తం    : 461 కోట్లు
మూడో విడత మాఫీ    : 502 కోట్లు
ఇప్పటిదాకా జమ అయిన మాఫీ సొమ్ము    : 1,906 కోట్లు
రెండు, మూడు విడతల్లో పెండింగ్‌    : 33 కోట్లు
నాలుగో విడత కావాల్సిన మొత్తం    : 547.70 కోట్లు
ఐదో విడత రావాల్సిన మొత్తం    : 586.60 కోట్లు
నాలుగు, ఐదు విడతల్లో రావాల్సిన సొమ్ము    : 1,131.30 కోట్లు
మాఫీ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న రైతులు    : 5.50 లక్షలు
అర్హత ఉన్నా మాఫీకి నోచుకోని రైతులు(అంచనా)    : 35వేలు
అరకొరగా మాఫీకి నోచుకున్న రైతులు(అంచనా)    : 85వేలు

Advertisement
Advertisement