Sakshi News home page

బురిడీ బాబు!

Published Wed, May 29 2019 1:23 PM

Chandrababu Naidu Cheat West Godavari TDP Leaders - Sakshi

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకే కాదు..సొంత పార్టీ నేతలకూ కుచ్చుటోపీ పెట్టారు. ఎన్నికల్లో డబ్బులు సర్దాలని, తర్వాత ఇస్తానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో ఆ సొమ్ముల కోసం ఓ టీడీపీ నేత అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయం జిల్లాలోని టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు:  ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టడానికి డబ్బులు పంపడంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాçకు చెందిన ఒక కీలక నేతకు నాలుగు నియోజకవర్గాలకు డబ్బులు సర్దాలని సూచించారు. ఆ మొత్తాన్ని ఏప్రిల్‌ 20 నాటికి తాను ఇస్తానని చెప్పారు. దీంతో సదరు నేత స్థానిక నాయకుల వద్ద అప్పులు చేసి 18 కోట్ల రూపాయలు నాలుగు నియోజకవర్గాలకు సర్దుబాటు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రోజూ ఆ నేత అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఈలోపు పార్టీ దారుణంగా ఓడిపోవడం, చంద్రబాబు ఇంటికే పరిమితమవ్వడం జరిగిపోయాయి. దీంతో ఆ టీడీపీ నేతకు డబ్బులు ఇచ్చినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

డబ్బులు సమకూర్చేబాధ్యత ఇంజినీరింగ్‌ కంపెనీకి..
ఎన్నికల వేళ అధికార పార్టీ డబ్బుల పంపిణీకి అవాంతరాలు ఎదురుకావడంతో  జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాలకు డబ్బులు సమకూర్చే బాధ్యతనుఒక ఇంజినీరింగ్‌ కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ నాలుగు నియోజకవర్గాలకు అక్షరాల 20 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాదన్న విషయం తెలియడంతో సదరు సంస్థ చివరి వరకూ తిప్పించుకుని డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో పోలవరం, చింతలపూడి, గోపాలపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు పంపిణీ చేసేందుకు డబ్బులు సర్దాల్సిన బాధ్యతను జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేతకు అప్పగించారు. ఆయన తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గంలోని తమ పార్టీ అభిమానులతో మాట్లాడి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఆయా అభ్యర్థులకు సర్దుబాటు చేశారు. టుబాకో మర్చంట్స్‌ వద్ద కోటి రూపాయలు, తాడేపల్లిగూడెం డాక్టర్‌ వద్ద కోటి రూపాయలు, పెంటపాడుకు చెందిన ఒక నేత నుంచి రెండు కోట్ల రూపాయలు, ఒక సర్పంచ్‌ నుంచి రూ. 30 లక్షలు, ఒక జమిందారు నుంచి రెండు కోట్ల రూపాయలు సేకరించారు. మిగిలిన వారి నుంచి రూ. 40లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ వçసూలు చేసినట్లు సమాచారం.

ఇప్పటివరకూ అందని సొమ్ములు
అయితే ఏప్రిల్‌ 11న పోలింగ్‌ పూర్తయినా ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడి వద్ద నుంచి డబ్బులు రాలేదు. దీంతో  ఆ ముఖ్యనేత అమరావతి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఈలోగా ఎన్నికల ఫలి తాలు రావడం తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగలడంతో అసలు డబ్బులు వెనక్కి వస్తాయా రావా అన్న భయం డబ్బులు సర్దుబాటు చేసిన వారిని వెంటాడుతోంది. దీంతో వారు తమ వద్ద డబ్బులు తీసుకున్న నేతపై ఒత్తిడి పెంచారు. పై నుంచి డబ్బులు రాకపోవడం, డబ్బులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరగడంతో సదరు నేత ముఖం చాటేస్తున్నట్లు తెలిసింది. దీంతో రూ.కోట్లు, లక్షల్లో డబ్బులు నోటిమాట మీద ఇచ్చిన వారంతా టెన్షన్‌ పడుతున్నారు. ప్రభుత్వం వస్తుందన్న నమ్మకంతో వీరందరూ డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా రాకపోవడంతో ఆ డబ్బులు ఎలా వెనక్కి రాబట్టుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement
Advertisement