Sakshi News home page

షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలి

Published Tue, Sep 2 2014 2:52 AM

షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలి - Sakshi

శ్రీకాకుళం అర్బన్:ఎటువంటి షరతులూ లేకుండా వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత రుణాలు మాఫీ చేయాలని ఏపీ స్టేట్ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళంలోని డీసీసీబీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు అంపలాం మాధవరావు మాట్లాడుతూ కుటుంబ యజమానితో నిమిత్తం లేకుండా అందరి రుణాలను మాఫీ చేయాలన్నారు.  జీవో నంబరు 174లో తెలిపిన ప్రకారం సహకార సంఘాల్లో రుణం చెల్లించి తిరిగి వాడకుండా ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర సహకార బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించాలన్నారు.
 
 జీవో నంబరు 174లో లేని విధంగా ప్రతి అప్పుదారునికి సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించమనడం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకు అగౌరవపరచి రైతుల ద్వారా సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించమని పీఏసీఎస్ ఉద్యోగులకు, సిబ్బందికి ఒత్తిడి తేవడం సరైన విధానం కాదన్నారు. పంటల బీమా పథకం ద్వారా వచ్చిన  సొమ్ముకు ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణ ఖాతాలకు నేరుగా చెల్లించాలన్నారు. ధర్నా కార్యక్రమంలో ఇచ్ఛాపురం పీఏసీఎస్ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, జిల్లా రైతాంగ ప్రధాన కార్యదర్శి కోనారి మోహనరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి వెలమల రమణారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు పోలాకి ప్రసాదరావు, పీఏసీఎస్ యూనియన్ జిల్లా కార్యదర్శి లోలుగు మోహనరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బమ్మిడి శ్రీరాములు  పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement