ఇది మాఫీయా! | Sakshi
Sakshi News home page

ఇది మాఫీయా!

Published Wed, Dec 17 2014 3:40 AM

ఇది మాఫీయా!

 మాఫీ పత్రాల్లో మాయాజాలం
 రుద్రిపేట గ్రామానికి చెందిన ఖండాపు సుందరమ్మ ఆంధ్రా బ్యాంకులో రెండున్నర ఎకరాల భూమిపై రూ.50 వేల పంట రుణం తీసుకున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆమెకు అధికారులు రుణ విముక్తి పత్రం అందజేశారు. రూ.50 వేల వరకు ఉన్న రుణం పూర్తిగా ఒకేసారి మాఫీ అవుతుందని అందులో ఉంది. అయితే తర్వాత పేరాలో మాత్రం సుందరమ్మకు రూ.3,749.21 రుణ విముక్తి లభించిందని.. అందులో మొదటి విడతగా రూ.749.50 బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు అదే పత్రంలో పేర్కొన్నారు. రూ.50 వేల లోపు ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించి పత్రంలోనే మొదటి విడతంటూ కేవలం రూ.750 జమచేయడం ఏమిటో అర్థం కాక ఆమె అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
 
 పాలకొండ:  రుణమాఫీకి సంబంధించి మా వద్ద ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వం నుంచి ఆదేశాలూ రాలేదు. రైతు సాధికార సదస్సుల్లో రుణమాఫీ పత్రాలు అందజేయమన్నారు. అంతకుమించి వివరాలు తెలియదు...
 - ఇది ఓ తహశీల్దార్ మాట  
  జాబితాలు ఎలా తయారు చేశారో తెలియదు. మాకు వచ్చిన జాబితాలనే ప్రకటిస్తున్నాం. దీనిపై మార్గదర్శకాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గ్రామాలకు వెళ్లాం. ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో మాకు తెలియదు..
 - ఇవి ఓ వ్యవసాయాధికారి వ్యాఖ్యలు
 
  మా వద్ద ఆధార్ నమోదు చేసుకొనే అవకాశం లేదు. రుణమాఫీకి సంబంధించి వెబ్‌ల్యాండ్ సైట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు వచ్చిన జాబితాలు ఎలా ఇచ్చారన్నది తెలియదు. రుణమాఫీ ఎవరికి వచ్చిందన్నది చెప్పలేం. ఇప్పటికే పలుమార్లు మేము ఆధార్, రేషన్ కార్డులు రుణ ఖాతాలకు అనుసంధానం చేశాం..
 ఓ బ్యాంక్ మేనేజర్ స్పందన
 
 ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ విషయంలో అధికారుల్లో నెలకొన్న గందరగోళానికి పై వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. అనర్హుల జాబితాలో చేరిన మాట అటుంచితే.. మాఫీ వర్తించిన వారు కూడా ప్రభుత్వం చెబుతున్నదేమిటో.. తమకు అందుతున్న మాఫీ మొత్తం ఎంతో చూసుకొని కళ్లు తేలేస్తున్నారు. అధికారులు సైతం వీరికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. రూ.50 వేల లోపు రుణాలు పూర్తిగా మాఫీ చేసేశామని
 
 ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌లో జాబితాలు పెట్టింది. రైతు సాధికార సదస్సులు పెట్టి రుణవిముక్తి పత్రాలు అందజేయాలని ఆదేశించింది. ఆరు రోజులపాటు జరిగిన ఈ సదస్సులు మంగళవారంతో ముగిశాయి. ఈ సదస్సులతో అయినా రుణమాఫీపై స్పష్టత వచ్చిందా అంటూ అధికారుల నుంచి లబ్ధిదారులు, బాధితుల వరకు అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకాలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ ఎవరికి ఇచ్చా రో, మిగతా వారికి ఎందుకివ్వలేదో ఎవరికీ అర్థం కాలే దు. అట్టహాసంగా తొలి విడత రుణమాఫీ జాబితా ప్రకటించినా.. అందులో 60 శాతం మంది రైతుల పేర్లు లేకపోవడంతో గత శుక్రవారం రాత్రి జాబితాలో చోటు ఎందుకు లేదో తెలియజేస్తూ మరో జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టారు. దాన్ని పరిశీలిస్తే అంతా మాయగా కనిపిస్తోంది. రేషన్, ఆధార్ కార్డుల నెంబర్ల నుంచి రుణ మొత్తాల వరకు అన్నీ తప్పుల తడకలే. ఒకే రేషన్ కార్డు నెంబర్‌తో వందల మంది రైతుల పేర్లు ఉన్నా యి. ఒకే ఆధార్ నెంబర్‌తో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు నమోదై ఉన్నాయి. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే అంతా ఆన్‌లైనే. మా వద్ద ఎటువంటి వివరాలు లేవని సమాధానం వస్తోంది. మరికొంతమంది అకౌంట్లు నాట్ ఫౌండ్ అంటూ ఆన్‌లైన్‌లో పెట్టారు. వీటన్నింటిపైనా రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సాధికార సదస్సుల్లో ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు. అయితే అప్పటికప్పుడు ఏదో సర్దిచెప్పడం తప్ప స్పష్టత గానీ, నిర్ధిష్ట హామీ గానీ ఇచ్చే స్థితిలో లేక అధికారులు సైతం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.
 
 టోల్‌ప్రీ ఎర్రర్
 ఆన్‌లైన్‌లో మాఫీ జాబితా లు పెట్టిన ప్రభుత్వం రైతు ల సందేహాలు నివృత్తి చే యడానికంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రకటించింది. అయితే ఈ నెంబర్(1800-100322066) ఒక్కసారైన పని చేస్తే ఒట్టు.  ఎన్నిసార్లు చేసినా ‘ఎర్రర్ ఇన్ కనెక్షన్’ అనే సమాధానమే వస్తోంది. దీంతో బాధిత రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
 
 

Advertisement
Advertisement