నిలదీయొద్దు.. నివేదించండి: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

నిలదీయొద్దు.. నివేదించండి: చంద్రబాబు

Published Sun, Feb 22 2015 2:21 AM

నిలదీయొద్దు.. నివేదించండి: చంద్రబాబు - Sakshi

ప్రత్యేక హోదా, ప్యాకేజీపై ఎంపీలకు చంద్రబాబు హితబోధ
 సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీని సాధించే విషయం సీఎం చంద్రబాబును ఇరకాటంలో పడేసింది. కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీని గట్టిగా డిమాండ్ చేయలేని స్థితిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తర్జనభర్జన పడ్డారు. విభజన హామీలను నెరవేర్చాలని లోక్‌సభ, రాజ్యసభల్లో రాష్ట్రానికి చెందిన మిగతా పార్టీల ఎంపీలు గట్టిగా పోరాటం చేసే అవకాశాలున్నా టీడీపీ  అందులో భాగస్వామి కావొద్దంటూ సొంత పార్టీ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు.
 
 వినతిపత్రాలు సమర్పణకే పరిమితం కావాలని సూచించారు. శనివారం ఏపీ సీఎం క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథిగృహంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశం బాబు అధ్యక్షతన జరిగింది.ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమావేశాలు జరిగే రోజుల్లో కేంద్రమంత్రులను కలసి హామీలను గుర్తుచేయడానికే పరిమితం కావాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశంలో ప్రధానిమోదీని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.మోదీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే  దేశానికి గుర్తింపు తెచ్చారన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు హాజరుకావడానికి ముందు ఎంపీలతో ఆయన కుమారుడు నారా లోకేష్ భేటీ అయ్యారు.
 
 స్థిరత్వం లేని కేసీఆర్..:తెలంగాణ సీఎం కేసీఆర్  స్థిర నిర్ణయాలు తీసుకోరని,  క్షణానికోరకంగా మారుతుంటారని చంద్రబాబు సమావేశంలో పేర్కొన్నారు. మొన్నటివరకూ సెటిలర్లు, ఏపీ వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు గ్రేట ర్ హైదరాబాద్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ సెటిలర్లు ఎవరూ లేరని, అందరూ హైదరాబాదీలేనని అంటున్నారని, కేసీఆర్‌కు ఒక పద్ధతి, సిద్ధాంతం లేదని విమర్శించారు.
 
 తాగునీటికి రూ.25 వేల కోట్లు..
 ఏపీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.25 వేల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ఎంపీ జేసీ మాట్లాడుతూ  హుద్‌హుద్ తుపానుకు కేటాయించాల్సిన తన నియోజకవర్గ అభివృద్ధి నిధులను మినహాయించాల్సిందిగా కోరగా సీఎం అంగీకరించలేదు.  సమావేశానంతరం గుండు సుధారాణి, కొనకళ్ల నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. తాము కేంద్రాన్ని కోరనున్న అంశాలను ప్రస్తావించారు.

Advertisement
Advertisement