కూర్చోండి.. బాబు గారు మాట్లాడుతున్నారు కదా | Sakshi
Sakshi News home page

కూర్చోండి.. బాబు గారు మాట్లాడుతున్నారు కదా

Published Sun, Jul 20 2014 2:39 AM

కూర్చోండి.. బాబు గారు మాట్లాడుతున్నారు కదా - Sakshi

సహజంగా ఎప్పుడైనా.. ఎక్కడైనా బహిరంగ సభలు.. సమావేశాలు పెట్టినప్పు డు నాయకుడి ప్రసంగం అయిపోయి.. ఆయన వెళ్లిన తర్వాత జనం లేచి వెళ్లడం పరిపాటి. కానీ.. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మీటింగుల రూటు మాత్రం సెపరేటు. ప్రసంగిస్తుండగానే జనం అంతా వెళ్లిపోతుండటం బాబు మీటింగుల ప్రత్యేకత. ముఖ్యమంత్రి చంద్ర బాబు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా కొయ్యలగూడెం సమీపంలోని ఆరి పాటిదిబ్బల ప్రాంతంలో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మహిళా సంఘాల ప్రతిని ధులు, డ్వాక్రా మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ రోజు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలన్నిటినీ మూయిం చేశారు. ఆ బస్సుల్లో మహిళలను పెద్దఎత్తున తరలించారు. వారికి భోజనం సహా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. సాయంత్రం 4.30కి సభ మొదలైంది. ముందుగా ఒకరిద్దరు జిల్లా నేతలు మాట్లాడిన తర్వాత చంద్రబాబు మైకు అందుకున్నారు.
 
 అంతే మహిళలు ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం మొదలెట్టారు. ఒక్కసారిగా గందరగోళం. సభలో ఉన్న వాలంటీర్లు ‘కూర్చోండి.. బాబు గారు మాట్లాడుతున్నారు కదా’ అని ఎన్నిసార్లు.. ఏవిధంగా మొత్తుకున్నా బయటకు వెళ్లే జనం మాత్రం ఆగలేదు. ఇది గమనించిన చంద్రబాబు తన ప్రసంగంలో ‘నా ఆడపడుచులకు టైమ్ అయిపోయింది. చీకటి పడుతోంది కదా. ఇంటికి వెళ్లి వంటావార్పు చేసుకోవాలి. పిల్లల్ని, ఇంటాయన్ను చూసుకోవాలి. అందుకే వెళ్లేందుకు తొందరపడుతున్నారు’ అని ముక్తాయింపు ఇచ్చారు. అయితే అలా వెళ్లిపోతున్న మహిళలు మాత్రం ‘ఇంటికెళ్లేందుకు తొందర కాదు. అంతన్నారు. ఇంతన్నారు. ఇంకేముంది ఈ మీటింగ్‌కు వస్తే డ్వాక్రా రుణాలు రద్దవుతాయని చెప్పారు. కానీ.. బాబుగారుమాత్రం ఇప్పుడు డబ్బుల్లేవు, నేను చూస్తాలే. చేస్తాలే అంటున్నారే కానీ.. కచ్చితంగా ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు. ఇక ఈ మీటింగుకొచ్చి ప్రయోజనమేంటి’ అంటూ ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ అలా ముందుకు వెళ్లిపోయారు.
 
 మంచోళ్లను మరిచారా జైన్
 ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఓ అధికారి బదిలీ అయితే కొత్తగా వచ్చిన అధికారికి బాధ్యతలు అప్పజెప్పేవరకు ఉండి రిలీవ్ కావడం సహజం. కానీ.. మన పూర్వకలెక్టర్ సిద్ధార్థజైన్ బదిలీ అయినట్టు పేపర్లలో వార్తలొచ్చాయి. అంతే ఆయన మళ్లీ జిల్లాలో ఎక్కడా కనిపిం చలేదు. సరిగ్గా ఏడాది క్రితం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చినప్పటి నుంచి తుపానులను ఎదుర్కోవడం, వరుస ఎన్నికల నిర్వహణతో తలమునకలైన ఆయన వ్యక్తిగత పనుల మీద నాలుగు రోజులు సెలవు పెట్టగానే చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయినట్టు ఉత్తర్వులు వచ్చాయి. చంద్రబాబు సొంత జిల్లా కదా.. హైదరాబాద్‌లో ఉన్న సిద్ధార్థజైన్ అటునుంచి అటే చిత్తూరు వెళ్లి బాధ్యతలు స్వీకరించేశారు. మరుసటి రోజే అక్కడ జరిగిన గ్రీవెన్స్ సెల్‌లోనూ పాల్గొని పనుల్లో బిజీ అయిపోయారు. బదిలీ అయి 10 రోజులవుతున్నా మన జిల్లాకు మాత్రం వచ్చిన దాఖలాలు లేవు. సందర్భం వచ్చినప్పుడల్లా పశ్చిమగోదావరి జిల్లా ప్రజ లు మంచోళ్లంటూ ఇక్కడి కలెక్టర్‌గా మురిసిపోయిన ఆయన సంగతి ఇప్పుడెలా ఉన్నా.. కలెక్టరేట్ సిబ్బంది మాత్రం ఆయన్ను ఇంకా మరువలేదు. అందుకే కొత్త కలెక్టర్  భాస్కర్ వచ్చి బాధ్యతలు స్వీకరించి వారం రోజు లైనా కలెక్టరేట్ బంగ్లాకు ఉన్న జైన్ బోర్డును మాత్రం తీయలేదు.
 
 దండాలు.. దండలు..
 మొన్నటి వరకు వరుస ఎన్నికలతో రాజకీయ పార్టీల నేతల దండాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఓట్ల కోసం మారుమూల పల్లెలకు కూడా వెళ్లి జనానికి చేతులు జోడించి దం డాలు, అవసరమైతే పొర్లుదండాలు కూడా పెట్టివచ్చారు. ఎన్నికలైపోయాయి. గెలిచినోళ్లు, కొత్త పదవులు అలంకరించినోళ్లు సత్కారాలు, సన్మానాలు గట్రా పూర్తి చేసుకుని ఇప్పుడిప్పుడే ఊళ్లకు వెళ్తున్నారు. అలా వెళ్తున్న నేతలకు సహజంగానే జనం పూలదండలతో స్వాగతం పలుకుతున్నారు. అలా ఏలూరు సమీపంలోని పల్లెలకు ఓ ఎమ్మెల్యే వచ్చారు.
 
 అక్కడున్న జనం మన ఎమ్మెల్యే వచ్చారం టూ గౌరవంతో కూడిన అభిమానంతో దండలతో స్వాగతం పలికేందుకు ముందుకు రాగా.. వెంటనే ఆయన ‘ఆగండి మీరు నాకు ఓటేశారా..’ అని మొహం మీద అడిగేశారట. వారు చెప్పేలోగానే.. ‘ఆలోచిస్తున్నారంటే మీరు నాకు ఓటేయలేదన్న మాట. మీరూ వద్దు.  మీ దండలూ వద్దు’ అంటూ వారిని, దండలను విసిరికొట్టినంత పనిచేశారంట సదరు ప్రజాప్రతినిధి. ఎన్నికలైన తర్వాత సహజంగా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరి తోనైనా సత్సంబంధాలు కొనసాగిం చేందుకు ఏ నాయకుడైనా ప్రయత్నిస్తుంటారు. కానీ ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపికట్టది మరోదారి దారి అంటారు కదా.. సరిగ్గా దీన్ని ఇక్కడ తిప్పిచదువుకోండి అంతే.
    - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement
Advertisement