కానుక కొందరికే | Sakshi
Sakshi News home page

కానుక కొందరికే

Published Thu, Jan 15 2015 12:47 AM

chandranna kanuka not for all in andhra pradesh

పేదలకు అరకొరగానే చంద్రన్న ‘కానుక’ పంపిణీ
ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం.. ప్రణాళిక లోపంతో అస్తవ్యస్తం
కార్డుదారుల్లో 60 శాతం మందికి కూడా అందని సంక్రాంతి సరుకులు
పలుచోట్ల మూడు, నాలుగు వస్తువుల పంపిణీతో సరిపెట్టిన వైనం
నాణ్యత నాసిరకం.. కరిగిపోయిన బెల్లం, ముక్కిపోయిన కందిపప్పు
చాలా చోట్ల నెయ్యి లేదు.. వస్తువుల తూకం కూడా తగ్గిన ఉదంతాలు
సంచులు లేవు.. లబ్ధిదారుల చేతుల్లోనే సరుకులను పెడుతున్న వైనం
అందని వారికి పండుగ తర్వాత సరుకులు ఇస్తామంటున్న అధికారులు


సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. పండుగ నాటికి తెల్లకార్డుదారులందరికీ.. ఆరు సరకులు ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు పదేపదే చెప్పినా ఆచరణలో పూర్తిగా అమలు చేయలేకపోయారు. గురువారం సంక్రాంతి పండుగ కాగా.. బుధవారం సాయంత్రానికి తెల్లకార్డుదారుల్లో 60% మందికి కూడా పంపిణీ జరగలేదు. సకాలంలో జిల్లాలకు సరుకులు పంపాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోవడంతో అంతటా గందరగోళం నెలకొంది.

చాలా జిల్లాలకు మంగళవారం సాయంత్రం వరకూ సరుకులు తరలిస్తూనే ఉన్నారు. పలు జిల్లాల్లో తెల్లకార్డుల సంఖ్యకు అనుగుణంగా సరుకులు ఇవ్వలేదు. దీంతో అనేక చోట్ల ఆరు సరుకులకు గానూ మూడు, నాలుగు సరుకులే ఇస్తున్నారు. నెయ్యి, కందిపప్పు చాలా మందికి అందడంలేదు. పలుచోట్ల ఇచ్చిన సరుకులు కూడా బాగా నాసిరకంగా ఉన్నాయి. పాకంలా కారుతున్న బెల్లం, ముక్కిపోయిన కందిపప్పు పంపిణీ చేశా రు.

ఏ వస్తువులోనూ కొలత సరిగా లేదని రాష్ట్రమంతా వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. వంద గ్రాముల నెయ్యి ప్యాకెట్లో 25 గ్రాములు, అర కేజీ కందిపప్పుకు 450 గ్రాములు, కేజీ శనగలకు 850 గ్రాములు, అర లీటరు నూనెకు 400 గ్రాములు ఇలా ప్రతి వస్తువులోనూ తూకం తక్కువే ఉంది. ఈ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇస్తానన్న సంచులు రాష్ట్ర వ్యాప్తంగా 30% కూడా ఇవ్వలేదు.

దీంతో పలుచోట్ల కార్డుదారుల చేతుల్లోనే వస్తువులను పెడుతుండగా, కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగుల్లో వాటిని ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ సరైన ప్రణాళికతో అమలు చేయనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆధార్ కార్డు, కుటుంబ వివరాలు, ఫ్యామిలీ ఫొటో అప్‌లోడ్ కాని రచ్చబండ కూపన్‌దారులకు నెలవారీ సరుకులతో పాటు సంక్రాంతి కానుక అందలేదు.

*  విశాఖ జిల్లాలో 98 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు చెప్తున్నా ఇంకా చాలా గ్రామాల్లో సరుకులు అందలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ 60 శాతం జరిగినా ఎక్కువ మందికి మూడు, నాలుగు సరకులే అందాయి.

* తూర్పుగోదావరి జిల్లాలో 15.19 లక్షల తెల్లకార్డుదారులకు సరకులు ఇవ్వాల్సివుండగా 75 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ లక్షన్నర మందికి నెయ్యి ప్యాకెట్లు అందలేదు. గోధుమపిండి, కందిపప్పు సగం మంది కార్డుదారులకు మాత్రమే వచ్చాయి.

* పశ్చిమగోదావరి జిల్లాలో 11.27 లక్షల మందికి సరకులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి పంపిణీ చేశారు. బుధవారం కూడా చాలా చోట్ల సరకులను డీలర్లకు అందివ్వలేకపోయారు.
    
* కృష్ణా జిల్లాలో పంపిణీ దాదాపు పూర్తయినా తూకాల్లో తేడాలు రావడం, నాసిరకం వస్తువులు ఇవ్వడంతో కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోని డీలర్ పాయింట్లకు స్టాకు అందలేదు.

* ప్రకాశం జిల్లాలో మొత్తం 8.32 లక్షల మంది కార్డుదారులుండగా సగం మందికి ఇంకా సరకులను పంపిణీ చేయలేకపోయినా అధికారులు మాత్రం 95 శాతం పంపిణీ పూర్తయినట్లు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో బెల్లం కేజీ చొప్పున బ్లాకులు ఇవ్వడంతో వాటిని పగలగొట్టి సమానంగా ఇవ్వాల్సి రావడం డీలర్లకు తలనొప్పిగా మారింది.

* నెల్లూరు జిల్లాలో 8.24 లక్షల మందికి చంద్రన్న కానుక ఇవ్వాల్సి ఉండగా 2.50 లక్షల మందికే సరకులు వచ్చాయి.
* కర్నూలు జిల్లాలో మొత్తం 10.36 లక్షల కార్డులుండగా సుమారు 2 లక్షల మంది కార్డుదారులకు సంక్రాంతి కానుక అందలేదు.
* అనంతపురం జిల్లాలో మండల స్టాకు పాయింట్ల నుంచి డీలర్లకు సకాలంలో సరకులు చేరలేదు.

* సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 9.84 లక్షల తెల్లకార్డుదారులు ఉండగా 80 శాతం మందికే సరకులు వచ్చాయి. ఇప్పటివరకూ 60 శాతం మందికే సరకులు అందాయి. కడప జిల్లాలో పంపిణీ 70 శాతం వరకూ పూర్తయినా చాలా చోట్ల డీలర్లు కార్డుదారుల నుంచి రూ. 20 చొప్పున వసూలు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement