ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రెడ్డి

Published Mon, Jan 14 2019 4:18 AM

Chandrasekhar Reddy as AP NGO President - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవో సంఘానికి కొత్త నాయకత్వం వచ్చింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాస్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన అశోక్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు ఆదివారం ఉదయం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం అధ్యక్షురాలు, కన్వీనర్లు హాజరయ్యారు. రాష్ట్ర సంఘానికి ఇన్‌చార్జి అధ్యక్షునిగా ఉన్న సీహెచ్‌ పురుషోత్తంనాయుడు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాస్‌లను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్‌ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం..
ఈ సందర్భంగా విలేకరులతో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు లక్షలమంది పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా వారి న్యాయమైన కోర్కెల సాధనకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నుంచి 35 శాతం మధ్యంతర భృతి మంజూరుకు  ప్రయత్నిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు స్థలాలిప్పించే విషయంలో ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ పదేళ్లపాటు ఎన్జీవో సంఘ నాయకునిగా క్రియాశీల పాత్ర పోషించానని, తనకు సహకరించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ పెద్దలకు భంగపాటు
ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్జీవో సంఘ ఎన్నికల్లో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని భంగపాటుకు గురయ్యారు. పశ్చిమ కృష్ణా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.విద్యాసాగర్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు అన్నివిధాలా ప్రయత్నించారు. చివరకు పోలీసు శాఖ ద్వారా కొన్ని జిల్లాల సంఘ నాయకులను బెదిరించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అశోక్‌బాబు ఆధ్యర్వంలో ఎన్జీవో సంఘం ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో అటువంటి కార్యవర్గమే ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మంచిదనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘ నాయకులకు వివరించినట్టు తెలుస్తోంది. విద్యాసాగర్‌ను ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు సహకరించాలని అశోక్‌బాబు కూడా పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే 11 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల్లోపు సీఎంతో అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని, ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కొందరు ముఖ్య నాయకుల్ని అధికారులు కోరారు. అయితే వారంతా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించి ఎన్నికను నిర్వహించారు.  

Advertisement
Advertisement