ఇంకా ‘ఎత్తు’కు ఎదుగుతారు! | Sakshi
Sakshi News home page

ఇంకా ‘ఎత్తు’కు ఎదుగుతారు!

Published Mon, Feb 25 2019 8:21 AM

Chess Competition in All Andhra Pradesh Districts - Sakshi

శ్రీకాకుళం : ప్రభుత్వం కాస్త ప్రోత్సహిస్తే చెస్‌ క్రీడాకారులు     మరింత ఎత్తుకు ఎదుగుతారని ఏపీ రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.డి రామారావు, ప్రధాన కార్యదర్శి కేవీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో చెస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, దాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా చెస్‌ అసోయేషన్, కార్తికేయ స్పోర్ట్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూసెంట్రల్‌ స్కూల్‌ వేదికగా జరుగుతున్న రెండురోజుల ఏపీ రాష్ట్రస్థాయి అండర్‌–7, సీనియర్‌ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల కార్యక్రమానికి వారు హాజరయ్యారు. పోటీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైడి రామారావు, కేవీ సుబ్రహ్మణ్యంలను ‘సాక్షి’ పలకరించింది. రాష్ట్రంలో చెస్‌ క్రీడల పురోగతి, ప్రగతి, భవిష్యత్‌ లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాల గురించి వారు ఇలా వివరించారు.

విశాఖలోప్రతిష్టాత్మకంగా పోటీలు:రామారావు
విశాఖపట్నంలో మే 4 నుంచి 12 వరకు ఆలిండియా అండర్‌–13 బాలబాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నాం. విశాఖలోని వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ చెస్‌ క్రీడాకారులు అద్భుతంగా ఆడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ చెస్‌ క్రీడా ఎంపికలు, పోటీలు జరుగుతున్నాయి. ఆదరణ కూడా అదే రీతిలో ఉంది. రాష్ట్రం నుంచి కనీసం 10 మంది గ్రాండ్‌మాస్టర్లను తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం, సహాయం అందితే మరిన్ని పోటీలను రాష్ట్రంలో నిర్వహిస్తాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.

శిక్షణ శిబిరాలు విస్తృతం:కేవీ సుబ్రహ్మణ్యం
రాష్ట్రంలో మున్ముందు శిక్షణ శిబిరాలను మరింతగా విస్తృతం చేస్తాం. రాష్ట్రంలో చెస్‌ క్రీడకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. క్షేత్రస్థాయిలో అనగా మండల, నియోజకవర్గస్థాయిలో చెస్‌పోటీలను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల సంఘ నాయకులకు దిశానిర్దేశం చేశాం. కొన్నిచోట్ల పోటీలను నిర్వహిస్తున్నారు. గత ఏడాది రష్యాకు చెందిన చెస్‌ గ్రాండ్‌మాస్టర్, కోచ్‌ అమనుటోవ్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చాం. అతని పర్యవేక్షణలో విజయవాడ, గుంటూరు వేదికల్లో నిర్దేశించిన క్రీడాకారులకు తర్ఫీదు ఇప్పించాం. త్వరలో రాష్ట్రంలో చెస్‌ క్రీడాకారులను ఎన్‌రోల్‌ చేయనున్నాం. రాష్ట్రంలో ఎంతమంది చెస్‌క్రీడాకారులు ఉన్నారనే విషయం సుస్పష్టం అవుతుంది.

క్రీడాపాలసీపై అవగాహన లేదు..
రాష్ట్రంలో శాప్‌ ప్రవేశపెట్టిన క్రీడాపాలసీ బాగుంది. అయితే చెస్‌తోపాటు మిగిలిన సంఘాల నాయకులకు దానిపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అవగాహన కల్పించేందుకు శాప్‌ కూడా అవసరమైన చర్యలు తీసుకోలేదు. చెస్‌ కాస్ట్‌లీ గేమ్, రాష్ట్ర చెస్‌ సంఘంలో అందరూ బాధ్యత తీసుకుకోవాలి. సమష్టిగా ముందుకు వెళ్తేనే విజయాలు అందుతాయి. తద్వారా పిల్లల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. 2016లో రాజమండ్రిలో అండర్‌–19, 2017లో విజయవాడలో అండర్‌–7 జాతీయస్థాయి పోటీలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దిగ్విజయంగా ముగించాం. శ్రీకాకుళంలో ఐదారేళ్లుగా రాష్ట్రస్థాయి చెస్‌పోటీలు జరుగుతుండడం శుభ పరిణామం. ఇక్కడ సంఘ కార్యదర్శి భీమారావు చెస్‌ అభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. మూడు నెలల్లో నేషనల్‌ రేటింగ్స్‌ టోర్నీ శ్రీకాకుళం వేదికగా జరుగుతుంది.

Advertisement
Advertisement