ఫాస్ట్‌ఫుడ్‌ వద్దు.. ఇంటి తిండి ముద్దు | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ఫుడ్‌ వద్దు.. ఇంటి తిండి ముద్దు

Published Sat, Jan 25 2020 11:01 AM

Children Illness With Fast Food Amaravati - Sakshi

ఉరుకులు పరుగుల జీవితంలో ఓపికగా ఇంట్లో వండి పిల్లలకువడ్డించే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. బజారులో దొరికే తినుబండారాలు, ఫాస్ట్‌ఫుడ్‌తో కడుపు నింపేయడం జరిగిపోతోంది. ఫలితంగాపిల్లలపై వైరస్‌ ఇన్ఫెక్షన్ల దాడి పెరిగి ప్రాణాంతకంగా మారుతోంది. వాతావరణంలో మార్పులకు తోడు కల్తీ ఆహారం, నీరు రోగాలనుతెచ్చిపెడుతున్నాయి. అశ్రద్ధ చేస్తే పిల్లల్లో లివర్, పాంక్రియాస్‌దెబ్బతినడం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

లబ్బీపేట (విజయవాడ తూర్పు):   రోడ్డుపై వెళ్తుంటే పానీపూరి బండి కనిపిస్తే చాలా పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. అయితే వాటిలో వేల రకాల వైరస్‌లు ఉంటాయని, వ్యాధులకు కారణం అవుతాయని పిల్లలు, పెద్దలు గ్రహించలేకపోతున్నారు. అంతేకాదు చెరుకు రసం.. ఛాట్‌ ఇలా రోడ్డు పక్కన అశుభ్రమైన వాతావరణంలో విక్రయించే ఆహార పదార్థాలను పిల్లలు ఎక్కువగా తినడం వల్ల పలు రకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పిల్లల్లో వైరస్‌ల కారణంగా హెపటైటిస్, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ఎక్కువగా  సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.  

సహజ ఆహారం మేలు  
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి పిల్లలకు పెట్టడం ఎంతో మేలు. వీటి వల్ల పిల్లలకు కావాల్సిన పోషకాలు లభించడంతో పాటు, వ్యాధులు సోకకుండా కాపాడవచ్చు. తినుబండారాలు సైతం ఇంట్లో తయారు చేయించినవే పిల్లలకు పెట్టాలి. బయట కొనుగోలు చేసిన పదార్థాలతో వేల రకాల వైరస్‌లు శరీరంలోకి వెళ్లి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  

వైరల్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువ
వాతావరణంలో మార్పులు, సీజన్‌లో మార్పుల సమయంలో పిల్లల్లో ఎక్కువగా వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఆ కారణంగా పిల్లలకు విష జ్వరాలు రావడం, ఇన్ఫెక్షన్లు సోకడం జరుగుతుంది. ఆహారం ద్వారా కూడా కొన్ని రకాల వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు కారణంగా మారుతున్నాయి. కామెర్లు వంటి వ్యాధులపై ఇంకా మూఢనమ్మకాలు పోలేదు. చేతిపై వాత పెట్టించడం, నాటు మందులు వాడటం చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్‌ పెరిగి లివర్‌ దెబ్బతినడం జరుగుతుంది. అపోహలు వీడి పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించాలి. –డాక్టర్‌ ఎన్‌ఎస్‌ విఠల్‌రావు,
ప్రొఫెసర్, పిడియాట్రిక్‌ విభాగం, ప్రభుత్వాస్పత్రి

పిల్లలకు సోకుతున్నవ్యాధులివే  
పిల్లల్లో ఇటీవల జీర్ణకోశ సమస్యలు పెరిగాయి. కామెర్లు, పాంక్రియాస్‌ దెబ్బతినడం, కడుపులో నొప్పి, వాంతులు అవడం, క్రానిక్‌ డయేరియా, రక్త విరేచనాలు, మలబద్దకం, లివర్‌లో ఇన్‌ఫెక్షన్స్‌ సోకడం జరుగుతోంది. ఇలాంటి వారిలో 25 శాతం మందికి జనిటిక్‌ కారణం కాగా, 75 శాతం మందిలో ఆహారపు అలవాట్లు, మందుల వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల పిల్లల్లో ఎలర్జిక్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా బాగా పెరిగినట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఒక పాప శరీరం అంతా ఎలర్జీ రాగా, ఆమెకు పరీక్షలు చేయగా, పాలు సరిపడక మిల్క్‌ ప్రోటీన్‌ ఎలర్జీ వచ్చినట్లు నిర్ధారణ అయింది. పిల్లల్లో చాలా మందికి కొన్ని ఆహార పదార్థాలు సరికడక ఎలర్జిక్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో ఆస్పత్రులకు పిల్లలు క్యూ కడుతున్నారు. 

Advertisement
Advertisement