Sakshi News home page

చిరంజీవి మళ్లీ నెం.1

Published Sat, Jul 1 2017 1:46 PM

చిరంజీవి మళ్లీ నెం.1 - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు చిత్రసీమలో నెంబర్‌ వన్‌. ఆయన తన డాన్స్‌లతో, డైలాగ్‌లతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు. ఎన్టీఆర్‌ తర్వాత సినీ ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజుగా వెలుగొందారు. చిత్రసీమలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించారు. అనంతరం రాజకీయల్లోకి వెళ్లారు. కాంగ్రెస్‌ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు చిరంజీవికి మరో అరుదైన స్థానం లభించింది.

తొలి ఓటు చిరంజీవిదే
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జులై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎన్డీఏ తరపున రామ్‌నాధ్‌ కోవింద్‌ బరిలో ఉండగా, విపక్ష కాంగ్రెస్‌, విపక్షాల తరపున మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. ఓటింగ్ కోసం మొత్తం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, రాష్ట్రాల శాసనసభ్యుల పేర్లను అక్షర క్రమంలో పొందుపర్చి తాజాగా ఎలక్ట్రోరల్ కాలేజి జాబితా విడుదల చేశారు. కాగా, ఇందులో మొదటి పేరు కాంగ్రెస్ పార్లమెంటుసభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిదే. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయనున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే చివరి పేరుకూడా తెలుగువారిదే కావడం. పాండిచ్చేరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్టచివరిదైన 4896వ స్థానంలో ఉన్నారు.

చిరంజీవి ఓటు ఎవరికి?
గత కొంతకాలంగా చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ,  రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పదవిని సైతం తిరస్కరించారనే వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌ తరపున ఏకార్యక్రమంలోను చిరంజీవి పాల్గొనలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ, స్పీకర్‌ మీరాకుమార్‌ పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో చిరంజీవి ఎవరికి ఓటేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement