మేయర్ భర్త, బంధువు మధ్య ప్రహరీ వివాదం | Sakshi
Sakshi News home page

మేయర్ భర్త, బంధువు మధ్య ప్రహరీ వివాదం

Published Thu, Jan 22 2015 2:11 AM

Chittor tension short baton charge

చిత్తూరులో ఉద్రిక్తత.. స్వల్ప లాఠీచార్జి
 

చిత్తూరు (అర్బన్): చిత్తూరు  కార్పొరేషన్ మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్, ఆయన మేనల్లుడు చింటూకు మధ్య బుధవారం తగాదా నెలకొంది. నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉన్న చింటూకు సంబంధించిన స్థలంలో ప్రహరి కూల్చేయడంతో ఈ వివాదం నెలకొంది. తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుంటే కఠారి మోహన్ కూల్చేశాడని చింటూ, అందరికీ సంబంధించిన దారిలో ప్రహరీ నిర్మిస్తున్నారని మేయర్ కుమారుడు ప్రవీణ్  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు ప్రహరీని కూల్చేయడంతో ఆగ్రహించిన చింటూ వర్గీయులు మేయర్ పేరుతో వెలసిన బ్యానర్లను చించేశారు.

దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  టూటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్వల్ప లాఠీచార్జ్ చేశారు. చింటూను స్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అధికార బలంతో తన కొడుకుపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కఠారి మోహన్ అక్క, చింటూ తల్లి సక్కూబాయమ్మ మేయర్ వర్గంపై మండిపడ్డారు.  ఇరువర్గాలు టీడీపీకి చెందిన వాళ్లే కావడం, రక్త సంబంధీకులు కావడంతో నగరంలో ఈ విషయం చర్చనీయంశంగా మారింది.
 

Advertisement
Advertisement