పేరు మార్చు..పన్ను ఎగ్గొట్టు! | Sakshi
Sakshi News home page

పేరు మార్చు..పన్ను ఎగ్గొట్టు!

Published Wed, Dec 11 2013 4:46 AM

chnage name for tax free

వరంగల్, న్యూస్‌లైన్: రైస్‌మిల్లుల యజమానులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఏజెన్సీలో ఉన్న మిల్లర్లు బినామీల పేరిట మిల్లులను పెడుతూ... సబ్సిడీని తీసుకుంటూ... పన్ను చెల్లింపుల్లో రాయితీ పొందుతూ.. సంవత్సరాలుగా మిల్లులను నడిపించుకుని పన్ను లక్షల్లో బాకీ పడగానే మూసేస్తున్నట్లు చూపుతున్నారు. కొన్నేళ్లుగా ట్యాక్స్ చెల్లిం చడం లేదంటూ నోటీసులిస్తున్న వాణిజ్య పన్నుల శాఖాధికారులు వాటిని మర్చిపోగానే కొత్తగా పేరు మార్చి మళ్లీ  వ్యాపారం సాగిస్తున్నారు.

నర్సంపేట డివిజన్‌లోని రాజుపేట శివారులోని మరో మూడు మిల్లులను పన్నులు ఎగ్గొంటేందుకు మూసేసి... కొత్త పేర్లతో మళ్లీ తెరిచారు. అరుుతే కొత్తగా పేర్లు మార్చినప్పటికీ లక్షల్లో పన్ను పేరుకుపోవడంతో వాటిని మాఫీ చేయించుకునేందుకు మిల్లర్ల అసోసియేషన్ నేతలు చక్రం తిప్పుతున్నారు. తమకు సాయం చేస్తే ప్రభుత్వానికి చెల్లించే పన్నులో సగం ఇస్తామంటూ ఓ మంత్రికి ఆఫర్ ప్రకటించినట్టు తెలిసింది. ఇప్పుడు మిల్లర్లు, మంత్రి ఇదే పనిలో రాజధాని చుట్టూ తిరుగుతున్నారు.
 గిరిజనుల పేరుతో బినామీలు..
 ఏజెన్సీలో మిల్లుల పేరు మార్పు దందా కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సాగుతోంది. ఉదాహరణగా గతంలో కనకదుర్గ రైస్ మిల్ ఉండ గా... ఇప్పుడు దాన్ని సాయి రైస్‌మిల్ పేరు తో, హరికృష్ణ రైస్ బాయిల్డ్ మిల్లును హరి రైస్‌మిల్లుగా మార్చారు. వీటితో పాటు మొత్తం పది మిల్లులను నర్సంపేట ప్రాంతంలో పేర్లు మార్చారు. వీటన్నింటినీ గిరిజనుల పేరిట అనుమతి తీసుకున్నారు. ఇందులో కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. గిరిజనుల పేరిట ఉన్న మిల్లులకు వాణిజ్య శాఖకు చెల్లించే పన్నులో రాయితీ ఉంటుంది. 5 శాతం పన్నుల్లో 2శాతం రాయితీ కల్పిస్తారు. ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల వరకు రాయితీ వర్తింపు ఉంటుంది. 6వ ఏట నుంచి మళ్లీ 5 శాతం పన్ను చెల్లించాల్సిం దే. కానీ.. ఇక్కడే మిల్లర్లు ప్రభుత్వానికి సున్నం పెడుతున్నారు. ఐదేళ్లు పూర్తి కాగానే ఆ మిల్లును మూసేస్తున్నట్లు ఎత్తుగడ వేస్తున్నారు.  
 రూ 21 కోట్లు ఎగవేత
 జిల్లా వ్యాప్తంగా సుమారు 140 మిల్లుల యజమానులు రూ. 21 కోట్ల పన్నును ఎగవేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నర్సంపేట సర్కిల్‌లోని 10 మిల్లులు రూ. 2.48 కోట్ల పన్నును చెల్లించడం లేదు. ఇప్పటికే ఆరేళ్ల పరిమితి మించిన మిల్లులు ఈ పన్నును ఎగవేస్తున్నాయి. కొన్ని మిల్లులకు ఇప్పటికే మూడు పర్యాయాలు పేర్లు మార్చుకుని పన్నులు ఎగ్గొట్టారు. జిల్లా వ్యాప్తంగా మిల్లర్లు ఇదే పంథా కొనసాగిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. కానీ.. వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు.  
 

Advertisement
Advertisement