ఈ పాపం బాబుదే | Sakshi
Sakshi News home page

ఈ పాపం బాబుదే

Published Fri, Dec 18 2015 12:17 AM

ఈ పాపం బాబుదే - Sakshi

ఆడిన మాట తప్పిన ముఖ్యమంత్రి
రుణ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ
అధికారంలోకి వచ్చినా తీరని అప్పులు
కొత్తగా రుణాలు ఇచ్చేది లేదని ఛీకొట్టిన బ్యాంకర్లు
తప్పక వడ్డీవ్యాపారుల గడపతొక్కిన మహిళలు, రైతులు
చివరకు అధిక వడ్డీ కబంధ హస్తాల్లో విలవిల...

 
కాల్‌మనీ వ్యాపారుల అకృత్యాలు, దురాగతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూల కారణమని జిల్లాలోని రైతులు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆడిన మాట తప్పి పాపం మూటగట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేసి ఉంటే నేడు ఈ అఘాయిత్యాలకు అవకాశమే ఉండేది కాదని విశ్లేషిస్తున్నారు.
 
గుంటూరు : కాల్‌మనీ అనర్థాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా రద్దు చేస్తానని, తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదని బాబు ప్రచారం చేశారు. ఆయనకు తోడు పార్టీ కార్యకర్తలు సైతం ఇంటింటికీ తిరిగి ‘బాబు వస్తే జాబు’తోపాటు రుణాలు రద్దవుతాయని ప్రజలను నమ్మించారు. తీరా, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మాట మార్చారు. షరతులు విధించారు. వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర గడిచినా తీసుకున్న రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు కాకపోగా, వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి.
 పాత అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. తప్పని పరిస్థితుల్లో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు కాల్‌మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అనేక మంది రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు  తమ ఆస్తులను పోగొట్టుకున్నారు.

 జిల్లాలో 11 లక్షల 47 వేల మంది రైతులు రూ.9,600 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తం మాఫీ అవుతుందని భావించారు. అయితే మాఫీకి సంబంధించి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు పట్టాదారు పుస్తకాలు ఉండాలన్నారు. పట్టాదారు పుస్తకాలు లేని రైతులను అనర్హులుగా ప్రకటించారు. మొత్తం రుణం  వాయిదాల్లో మాఫీ చేస్తామని, రుణ మాఫీలో ఆలస్యమైనా వడ్డీని తామే చెల్లిస్తామని పాలకులు చెప్పారు.  మొదటి దశలో రూ.543 కోట్లు చెల్లించారు. అయితే వడ్డీలు, సర్‌చార్జీలు కలిపి పెరిగిన రుణంలో ఈ మొత్తం 10 శాతం కూడా లేకపోవడంతో రైతుల రుణ మొత్తాలు తగ్గలేదు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు.
 
ప్రతీ ఖరీఫ్‌లో వరి రైతు ఎకరాకు రూ.20 వేల వరకు రుణం తీసుకుంటాడు. ఈ సారి బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రుణాల కోసం రైతులు కాల్‌మనీ, అధిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీనిని అలుసుగా తీసుకున్న కాల్‌మనీ వ్యాపారులు ఇళ్లు, ట్రాక్టర్లు, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకుని రైతులకు రుణాలు ఇచ్చారు.
 
ఒక వైపు పాత అప్పులు కట్టాలని బ్యాంకర్ల ఒత్తిడి, మరో వైపు కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక కొందరు రైతులు అనారోగ్యంతో మృతి చెందితే మరికొందరు  ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మొత్తం 60 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం బాబుదేనని ఆ రైతు కుటుంబాలు ఘోషిస్తున్నాయి. జిల్లాలో 55 వేల డ్వాక్రా గ్రూపుల్లో ఎక్కువ మంది సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన మాటల గారడీతో బురిడీ కొట్టించారు. వారు తీసుకున్న రూ.450 కోట్లను రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులంతా అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చివరకు ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి  రూ. 3 వేలను బ్యాంకులో జమ చేశారు. అయితే సభ్యులు వడ్డీలు చెల్లించడం లేదని ఆ రూ.3 వేలను బ్యాంకర్లు లాగేసుకున్నారు. చివరకు మహిళలు కూడా బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదని కాల్‌మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలో సకాలంలో చెల్లించని అనేక మంది మహిళలపై కాల్‌మనీ నిర్వాహకులు నియమించిన బౌన్సర్లు దాడులు చేశారు. ఇళ్లల్లో సామాన్లు బయట పడేసిన సంఘటనలు జిల్లాలో లేకపోలేదు. విజయవాడ తరహా సెక్స్‌రాకెట్ అకృత్యాలు గుంటూరులో బయటపడలేదని, అయితే ఆ తరహా దురాగతాలు లేవని చెప్పలేమని కొందరు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement