వారంలో పోలవరం కాంక్రీట్‌ పనులకు టెండర్లు | Sakshi
Sakshi News home page

వారంలో పోలవరం కాంక్రీట్‌ పనులకు టెండర్లు

Published Tue, Nov 7 2017 2:23 AM

CM Chandrababu command in Polavaram Virtual Review - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో స్పిల్, స్పిల్‌ చానల్‌కు చెందిన కాంక్రీట్‌ పనులకు వారంలోగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి ఈ పనులను వేగవంతం చేయాలన్నారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై వర్చువల్‌ రివ్యూ నిర్వహించారు. ఈ వారంలో స్పిల్‌ చానల్‌లో 50 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 7,207 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేశామని ఎస్‌ఈ రమేశ్‌బాబు వివరించారు.

రేడియల్‌ స్కిన్‌ గేట్లు, ఆర్మ్‌ గిర్డర్స్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారు. డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు 38.6 మీటర్లు పూర్తి చేశామన్నారు. భారీ వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. పుణెలో సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో రూ.40 లక్షల వ్యయంతో ఎకరం విస్తీర్ణంలో మినీ పోలవరం ప్రాజెక్టును నిర్మించామని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ మినీ ప్రాజెక్టులో త్రీడీ పద్ధతిలో ప్రయోగాలు చేస్తున్నామని.. ఏవైనా లోపాలు బయటపడితే వాటిని సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.

ఈ నెలలో పది ప్రాజెక్టులు జాతికి అంకితం
రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టుల పనులపై సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెలలో ఎర్ర కాల్వ, పోగొండ, పెదపాళెం ఎత్తిపోతల, చినసాన ఎత్తిపోతల, మారాల రిజర్వాయర్, కండలేరు ఎడమ కాలువ, అవుకు టన్నెల్, గోరకల్లు రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, సిద్ధాపురం ఎత్తిపోతలను జాతికి అంకితం చేస్తామని తెలిపారు. వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్న ఇస్రో అధికారులను ఆయన అభినందించారు.  

Advertisement
Advertisement