నావల్లే ప్రవాసాంధ్రులు పారిశ్రామికవేత్తలయ్యారు | Sakshi
Sakshi News home page

నావల్లే ప్రవాసాంధ్రులు పారిశ్రామికవేత్తలయ్యారు

Published Sun, May 14 2017 1:52 AM

నావల్లే ప్రవాసాంధ్రులు  పారిశ్రామికవేత్తలయ్యారు - Sakshi

- నేనిచ్చిన పిలుపుతోనే వారంతా ఎదిగారు
- అందుకే వారంతా నాకు రాయల్టీ కట్టాలని చెప్పా
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి


సాక్షి, అమరావతి: అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తన వల్లే ఆ స్థాయికి ఎదిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వృత్తి నిపుణులుగా  ఎదిగిన తెలుగువాళ్లు అంతటితో ఆగకుండా పారిశ్రామికవేత్తలుగా మారాలని తాను ఇచ్చిన పిలుపుతోనే జూయిష్‌ జాతి మాదిరిగా తయారయ్యారని తెలిపారు. అందుకే వారు సంపాదించే డబ్బులో తనకూ వాటా కూడా ఉందని, రాయల్టీ చెల్లించాలని చెప్పినట్లు వ్యాఖ్యానించారు. శనివారం వెలగపూడి సచివాలయంలో  మీడియాకు చంద్రబాబు అమెరికా పర్యటన విశేషాలను వివరించారు. అమెరికాలోని యూనివర్సిటీలు తనకు పీహెచ్‌డీలు ఇస్తానన్నా వద్దన్నానని తెలిపారు. 

యూఎస్‌ఐ బీసీ తనకు ఇచ్చేందుకే ప్రత్యేకంగా ఒక అవార్డును సృష్టించి మోస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌మేటివ్‌ సీఎం అవార్డు ఇచ్చిందన్నారు.  తన పర్యటనలో రెండు కీలక అంశా లున్నాయని అందులో ఒకటి సోలార్‌ విద్యుత్‌ నిల్వకు దోహదం చేసే ప్రాజెక్టు కాగా, కర్నూలులో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు అయోవా యూనివర్సిటీతో చేసుకున్న ఒప్పందం రెండోదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కర్నూలులో ఉందన్నారు. సోలార్‌ విద్యుత్‌ను నిల్వ చేసే కొత్తప్రయోగానికి అమెరికాలోని టెస్లా కంపెనీ శ్రీకారం చుట్టిందని, అందుకే దానితో రాష్ట్రంలోని రెండు చోట్ల ఎనిమిది మెగావాట్ల ప్లాంట్లను ప్రయోగాత్మకంగా పెట్టాలని కోరినట్లు తెలిపారు. 

అంతా బాగా జరిగితే పవర్‌ గ్రిడ్‌లు మూసేస్తామన్నారు. హైడల్‌ విద్యుత్‌ ప్లాంట్లు కూడా వద్దనుకుం టున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా వెయ్యి మెగావాట్ల హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్ర నిర్మాణాన్నీ నిలిపివేయాలని భావి స్తున్నట్లు తెలిపారు. కర్నూలులో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు అయోవా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఈ పర్యటనలో వివిధ కంపెనీలతో 28 ఒప్పందాలు చేసుకున్నామన్నారు.

Advertisement
Advertisement