అవేం మాటలు | Sakshi
Sakshi News home page

అవేం మాటలు

Published Wed, Mar 16 2016 12:23 AM

అవేం మాటలు - Sakshi

 అసెంబ్లీలో అధికార పక్షం వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన
 సభ్య సమాజం సిగ్గుపడుతోంది : టీడీపీయేతర పక్షాలు
 చంద్రబాబూ ! ఇదేనా.. నీ రాజకీయ అనుభవం : కొత్తపల్లి

 
 ‘కొవ్వెక్కి.. కోరలు తీస్తా ఖబద్దార్.. నువ్వు మగాడివైతే.. రాయలసీమ రక్తం నీలో ఉంటే...’
 అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, విపక్ష సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన నీచమైన వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఆ మాటలను, మాట్లాడిన నేతల వ్యవహార శైలిని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు ఉభయ కమ్యూనిస్ట్ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :
  ప్రభుత్వంపై అసెంబ్లీలో సోమవారం వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్‌ను, పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని అధికార పక్షం తిట్ల పురాణం అందుకున్న విషయం విదితమే. సభా మర్యాదలకు పూర్తిగా తిలోదకాలిచ్చి ప్రతిపక్ష సభ్యులను ఇష్టానుసారం అభ్యంతరకర పదజాలంతో దూషించింది. టీడీపీ సభ్యులు వేలు పెట్టి చూపిస్తూ బెదిరింపులకు దిగిన వైనంపై మంగళవారం జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. చంద్రబాబు సహా మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమమాహేశ్వరరావు విచక్షణ కోల్పోయి పలికిన మాటలు ఏవగింపును కలిగించాయన్న వాదనలు అన్నివర్గాల నుంచి వినిపించాయి. నోరు తెరిస్తే సభా సంప్రదాయాలు, విలువలు, హుందాతనం అని మాట్లాడే చంద్రబాబునాయుడు నిజస్వరూపం మరోసారి బయటపడిందని టీడీపీయేతర పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు  విమర్శించారు.
 
 బాబూ.. ఇదేనా నీ అనుభవం
 రాజకీయాల్లో విలువల గురించి పదేపదే మాట్లాడే సీఎం చంద్రబాబునాయుడుకు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇదే నేర్పిందా. చంద్రబాబు విచక్షణ కోల్పోయి.. పూనకం వచ్చినట్టు మాట్లాడిన వైనం చూసి సామాన్య ప్రజలు కూడా నివ్వెరపోయారు. చంద్రబాబే ఇష్టానుసారం మాట్లాడటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. ఎవరేమిటనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఎందుకింత అసహనంతో ఊగిపోతున్నారో అర్థం చేసుకుంటున్నారు.
 - కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ

 అసహనానికి నిదర్శనం
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ సభ్యులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి అసహనానికి నిదర్శనం. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ టీడీపీ నేతల కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరినప్పుడల్లా చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడటం అందరూ గమనిస్తున్నారు.  టీడీపీ సభ్యులు దివాళాకోరుతనంతో నోటికొచ్చినట్టు మాట్లాడినా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం సంయమనం కోల్పోకుండా వ్యవహరించడమే ఆయన హుందాతనానికి నిదర్శనం.
 - ఘంటా మురళీరామకృష్ణ,
 వైఎస్సార్ సీపీ కన్వీనర్, చింతలపూడి
 
 కోర్టులో ఉన్న అంశాలను ఎలా ప్రస్తావిస్తారు

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టులో విచారణలో ఉన్న అంశాలను ఎడాపెడా ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగడం దారుణం. ఇది కోర్టులను ధిక్కరించడమే. ప్రతిపక్ష నేతపై మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగడమే కాకుండా అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, ఎడాపెడా కువిమర్శలు కురిపించడం టీడీపీ నేతల అసహనానికి అద్దం పడుతోంది.
 - పీడీఆర్ రాయల్, న్యాయవాది
 
 వినాల్సిన ఓపిక పాలకపక్షానికి ఉంది
 చట్టసభల్లో ప్రతిపక్షం ఏం మాట్లాడినా, వినాల్సిన ఓపిక పాలక పక్షానికి ఉంది. ప్రతిపక్ష నాయకులను మాట్లాడనివ్వకపోవడం వారు మాట్లాడే మాటలను వినకపోవడం దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమవుతుంది. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత స్పీకర్‌కు ఉంది.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నెలలు, సంవత్సరాలు పాటు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. చట్ట సభల్లో ప్రతిపక్షమైనా, పాలక పక్షమైనా, స్పీకరైనా ప్రజాసమస్యలపై చర్చ జరిగే విధంగా చూడాలి. అప్పుడే ప్రజలకు చట్టసభలపై  గౌరవం పెరుగుతుంది.
 -  బి.బలరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం
 
 రెచ్చగొట్టి.. వక్రీకరిస్తున్నారు
 టీడీపీ నాయకుల తిట్లు, బెదిరింపులు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాయి. వైఎస్ జగన్‌ను రెచ్చగొట్టి ఆయన చేసే వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. స్పీకర్ గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగతమంటున్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడితే వ్యక్తిగతం కాదా. అధికార మదంతో మీరేమి చేస్తున్నా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీకు త్వరలో ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతున్నట్టు కనిపిస్తోంది.
 - వేగి చిన్నప్రసాద్, ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం

 స్పీకర్ ప్రజల సమస్యలపై చర్చించాలి
 స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై లోతుగా చర్చించడంలో అధికార పక్షం తీవ్రంగా విఫలమైంది.  ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులున్నాయంటూ అసందర్భ వ్యాఖ్యలు చేయడం  సబబు కాదు. స్పీకర్ తనవంతు పాత్రను సక్రమంగా  నిర్వహించకపోవడంతో మంత్రులు ఇష్టమొచ్చినట్టుగా  చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం, అధికార పక్షం  చర్చించి సమస్యలు
 పరిష్కరించాలి.
 - డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి, సీపీఐ
 
 ప్రజలు ఆశతో ఎదురు చూస్తుంటారు
 అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం తమ సంక్షేమం కోసం ఏమైనా చేస్తుందని భావిస్తుంటారు. కానీ.. పాలకపక్షం మాత్రం కేవలం ప్రతిపక్ష నాయకుణ్ణి బదనాం చేయడానికి చూస్తోంది.  
 - కాదులూరి తిలక్, అధ్యక్షుడు, ఏలూరు స్వర్ణకార సంఘం

Advertisement

తప్పక చదవండి

Advertisement