ఉక్కిరి బిక్కిరి | Sakshi
Sakshi News home page

ఉక్కిరి బిక్కిరి

Published Fri, Jan 2 2015 3:02 AM

ఉక్కిరి బిక్కిరి

సాక్షి, గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తుళ్లూరు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం ఈ పర్యాయం ఉక్కిరిబిక్కిరైంది. అడుగడుగునా ప్రయాసపడింది. చివరకు కాన్వాయ్‌లో పంపాల్సిన వాహనాలనూ వెతుక్కోవాల్సి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల వేదికను చివరి నిమిషంలో  రాజధాని గ్రామం తుళ్లూరుకు మార్చడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. తొలుత విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర  ప్రభుత్వం హఠాత్తుగా కార్యక్రమాన్ని తుళ్లూరుకు మార్పు చేసినట్టు, వేడుకలకు సీఎం వస్తున్నట్టు  బుధవారం రాత్రి 11 గంటల సమయంలో వెల్లడించింది. దీంతో జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు తీశారు.
 
జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, రూరల్, అర్బన్ జిల్లా ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, రాజేష్‌కుమార్ అర్ధరాత్రి వేళ బయలుదేరి తుళ్లూరు చేరుకున్నారు. ఈ లోగా  సీఎం భద్రత చూసే అడ్వాన్స్ సెక్యూరిటీ వింగ్‌ను అప్పటికప్పుడు ఆ గ్రామానికి తరలించారు. వరుసగా పోలీస్ బలగాలు, మిగిలిన అధికారులు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
 
సీఎం కార్యక్రమం ఆఖరి నిమిషంలో గుంటూరు జిల్లాకు మార్పు చేసినప్పటికీ ఎస్పీలు ఇద్దరూ తెల్లవార్లూ అక్కడే మకాం చేసి ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లుగావించారు. అప్పటికప్పుడు తుళ్లూరు కేవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో తాత్కాలిక హెలిప్యాడ్ సిద్ధం చేయించారు. మేరీమాత ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సర వేడుకల కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వేదికను నిర్మించారు. చివరకు సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అధికారులంతా హమ్మయ్యా అంటూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
 
జిల్లా పోలీస్ అధికారులంతా తుళ్లూరులోనే...
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, బందోబస్తు నిమిత్తం జిల్లాలోని పోలీసులతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను తుళ్లూరు తరలించారు. చివరకు గుంటూరులో నూతన సంవత్సర వేడుకల బందోబస్తు చూసేందుకు సైతం పోలీసులు లేకుండాపోయారు.
* గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా నుంచి 10 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 100మంది ఎస్‌ఐలు, 700 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, వందమంది సాయుధ పోలీసులు జిల్లా నుంచి తుళ్లూరు తరలి వెళ్లారు.
* సీఎం కాన్వాయ్‌లో వాహనాల ఏర్పాటు పోలీసు అధికారులకు పెద్ద ప్రహసనంగా మారింది. అర్ధరాత్రి వేళ సుమారు 20 వాహనాలు వెతుక్కుని వాటికి ఒకే నంబర్ కలిగిన ప్లేట్లు అమర్చడానికి  శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా సీఎం పర్యటనను విజయవంతంగా ముగించడంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసనీయ పాత్ర పోషించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement