Sakshi News home page

ముసుగొకటి.. ముఖమొకటి!

Published Mon, Jan 13 2014 1:42 AM

ముసుగొకటి.. ముఖమొకటి! - Sakshi

 బట్టబయలవుతున్న ముఖ్యమంత్రి వ్యూహం  
  ‘సమైక్యం’ ఉత్తిమాటే.. అధిష్టానం మాటే అసలు ఎజెండా
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 చెప్పేదొకటి చేసేదొకటి అన్న తరహాలో సాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కుయుక్తి.. విభజన బిల్లు ముసాయిదా విషయంలోనూ బట్టబయలైంది. సమైక్యవాదం ముసుగు కప్పుకొని లోలోపల విభజనకు పూర్తి సహకారం అందించడమే కాకుండా ప్రతిదశలో ప్రత్యర్థి రాజకీయ పార్టీపై బురదజల్లే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో అంట కాగుతోందని తీవ్ర విమర్శలెదుర్కొంటున్న పాలకపక్షం కాంగ్రెస్.. తాజాగా విభజన బిల్లు విషయంలోనూ అదే కుమ్మక్కు రాజకీయం నడుపుతోంది. బిల్లును సభలో ప్రవేశపెట్టడం, చర్చను ప్రారంభింపజేయడం.. ఈ సందర్భాల్లో ఉపయోగించిన ఎత్తుగడలనే ముసాయిదా అంశాల సవరణల విషయంలోనూ అమలు చేసింది. ఇకపై కూడా అదే పంథా కొనసాగించే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
 
 మొదట్నుంచీ విభజన ప్రక్రియను అడ్డుకోగలిగే అన్ని అవకాశాలను చేజేతులా వదిలేస్తూ.... తదుపరి దశపై ఆశలు కల్పిస్తూ వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి అంకంలోనూ అదే చేస్తున్నారు. ముసుగొకటి-ముఖమొకటి అన్న తరహాలోనే మరో రెండస్త్రాలు ఆయన అమ్ముల పొదిలోంచి బయటపడొచ్చంటున్నారు. ముసాయిదా బిల్లుపై చర్చకు మరికొంత గడువు కావాలని రాష్ట్రపతిని కోరడం వాటిలో ఒకటైతే, ‘రాజీ’నామా అస్త్రం మరొకటి. ప్రభుత్వ పరంగా జరగాల్సిన అన్ని ప్రక్రియల్ని అధిష్టానం కనుసన్నల్లో సజావుగా జరిపించి, ఆనక తీరిగ్గా రాజీనామా చేసి కొత్త కీర్తి మూట కట్టుకోవాలని ఆయన తాజా ఎత్తుగడగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వ్యవహారంలో మొదట్నుంచీ మాటలకు-చేతలకు పొంతనలేని తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘ముందు ముందు చూడండి ఏం చేస్తానో’ అంటూ చెప్పిన ఎన్నో మాటలు, తీరా ఆ దశ వచ్చే సరికి నీటి మూటలై కనిపించాయి. ముసాయిదా బిల్లులోని ప్రతి క్లాజ్‌కూ ప్రతిపాదించే సవరణలపై ఓటింగ్ ఉంటుందని చెబుతూ వచ్చి.. చివరకు తుస్సుమనిపించారు.
 
  సవరణలు తాను ప్రతిపాదించకపోవడం వల్ల సభానాయకుడై ఉండి కూడా రేపు ఓటింగ్ కోరే నైతికతను సీఎం కోల్పోయారని ఆ పార్టీ నేతలే సనుక్కుంటున్నారు. నిజానికి, బిల్లును సాధికారికంగా సభలో ప్రవేశపెట్టే దశలోనే, కావాలని బిఏసీకి రాకుండా పక్కకు తప్పుకొని తెరవెనుక వ్యవహారానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిచ్చారని వారు గుర్తుచేస్తున్నారు. ఆది నుంచీ ఆయన అమలు పరుస్తున్న ‘రహస్య ఎజెండా’ దాదాపు అందరికీ తెలిసిపోయినా ప్రతి దశలోనూ కొత్త మలుపులు రాజకీయ పరిశీలకులను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. చర్చను అడ్డుకోవడమంటేనే విభజనకు సహకరించడమనే విచిత్ర వాదనను తెరపైకి తెచ్చి ప్రత్యర్థి పార్టీపై బురదజల్లే యత్నం చేశారు.
 
 సానుకూలంగా ఉండే ఓ వర్గం మీడియాతో పాటు అవసరాల కోసం అంటకాగే భాగస్వామ్యపక్షం నేత చంద్రబాబు సహకారం తీసుకొని ఆ అంచెను కూడా జయప్రదంగా దాటుకురాగలిగారు. సభలో బిల్లు ముసాయిదాపై సజావుగా చర్చను ప్రారంభింపజేయడం, సవరణలే ప్రతిపాదించకపోవడం ద్వారా తెలంగాణ వాదుల  హర్షామోదాలు పొందారు. ఇక సమైక్యవాదపు ముసుగులో ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్న ఆయుధం ‘ఓటింగ్’ పై కూడా దీంతో భ్రమలు తొలగుతున్నాయి. అసలు ఓటింగ్ లేకుండానే బిల్లుపై అభిప్రాయాలనూ ‘మమ’ అనిపించి, ముసాయిదా ప్రతిని ఢిల్లీకి పంపించడం ఖాయమని కాంగ్రెస్ నాయకుల తాజా మాటల్ని బట్టి స్పష్టమౌతోంది.  
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో ముందుగా ఒక తీర్మానం చేయాలని మొదట్నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఏ దశలోనూ సీఎం పట్టించుకోలేదు. బిల్లు ముసాయిదా ఇక్కడికి రావడానికన్నా ముందే సభలో సమైక్య తీర్మానం చేసి ఉంటే.. సమైక్యవాదం బలంగా ఉండటమే కాకుండా విభజనను అడ్డుకోవడానికి ఎంతో సానుకూల పరిస్థితి ఉండేదనేది సమైక్యవాదుల అభిప్రాయం. ఆ రాజమార్గాన్ని చేజేతులా వదిలేశారు. పైగా బిల్లు ముసాయిదా రాష్ట్ర శాసనసభకు రెండు మార్లు వస్తుందనే ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారంలో పెట్టారు. అలా రావటం లేదని, ఒకే మారు.. అదీ కేవలం అభిప్రాయం కోసం వస్తుందని స్పష్టమైన తర్వాత కూడా సభలో దాన్ని ఓడించి పంపవచ్చనీ ప్రచారం చేశారు. అవన్నీ ఉత్తుత్తి మాటలేనని తదుపరి ప్రతిదశలోనూ రూఢీ అవుతూ వచ్చింది.
 
 ద్విముఖ వ్యూహం
 కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో ఆది నుంచీ వ్యూహాత్మకంగా సాగటం వెనుక స్వామికార్యంతోపాటు స్వకార్యం అనే యోచన ఉందని చెబుతున్నారు. తానొక ప్రణాళిక రచించి, దాన్ని అమలు పరుస్తూ ‘మీరు నిర్ణయించింది సాఫీగా జరిపిస్తాను, అయితే నేను కాస్తా అధిష్టానాన్ని ధిక్కరించినట్టున్నా మీరు చూసీ చూడనట్లుండాల’నే ప్రతిపాదనపై అధిష్టానం పూచీతో ఇదంతా చేసినట్టు స్పష్టమౌతోంది. ఈ లోపాయికారి ఒప్పందం లేకుండా నిజమైన సమైక్యవాదంతో, ఆనాడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించి ముఖ్యమంత్రి ముందుకు సాగి ఉంటే పరిణామాలు భిన్నంగా ఉండేవని పరిశీలకులు అభిప్రాయపడ్తున్నారు.
 
 మూకుమ్మడి రాజీనామాలు, ఎడతెగని ఆందోళనలు, ఉద్యోగుల నిరవధిక సమ్మె.. తదితర పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రభుత్వం కూలిపోయేది. అలా కాకుండా, వ్యూహాత్మకంగా కడవరకూ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూనే అధిష్ఠానపు రహస్య ఎజెండాను సాఫీగా అమలుపరిచారు. ఫలితంగా తన ప్రభుత్వం నిలబడింది. మరోవైపు బిల్లు పార్లమెంటుకు వెళ్లే మార్గం సుగమమైంది. ద్విముఖ వ్యూహం విజయవంతంగా అమలు పరుస్తున్న సీఎం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో దాదాపు రోజూ టెలిఫోన్ సంప్రదింపుల్లో ఉంటున్నట్టు సమాచారం. ‘పార్టీకి వీర విధేయుడు’ అని గులామ్ నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్‌తో మెప్పు పొందుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఈ విధేయతకు రాష్ర్ట విభజన అనంతరం పార్టీ అధిష్టానం కానుకగా ఇచ్చేదేదైనా ‘బోనస్’గా భావించనున్నారు. తరువాత ఏమిటి? కొత్త పార్టీ ఉంటుందా? అని అడుగుతూ ఒత్తిడి పెంచుతున్న సీమాంధ్ర నాయకులతో మాట్లాడుతున్నపుడు ముఖ్యమంత్రి ఇటువంటి భావనలనే వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
 
 ‘నాదేముంది, అసాధారణంగా ముఖ్యమంత్రినయ్యాను, అనూహ్యంగా ఇంతకాలం కొనసాగాను, ఇంకేదో కావాలని నాకేమి లేదు, ఏం ప్రధానమంత్రినవుతానా? మీరందరూ కలిసి ఏదైనా గట్టి నిర్ణయం తీసుకొని ముందుకెళదామంటే, నాకేమీ అభ్యంతరం లేదు అలాగే చేద్దామ’న్నట్లు మాట్లాడుతున్నారని ఆయన్ని కలిసివచ్చిన కొందరు నాయకులు చెబుతున్నారు. కొత్త పార్టీ సంగతెలా ఉన్నా, శాసనసభ బిల్లు ముసాయిదాను తిప్పిపంపాల్సిన ఈ నెల 23వ తేదీ గడువు ముగిసిన తర్వాత మరేదో ఆయుధం పేలుస్తానని ముఖ్యమంత్రి కల్పిస్తున్నదీ మరో ‘ఎత్తుగడా?’ అన్న సందేహం ఆయన అనుచరగణంలోనే వ్యక్తమౌతోంది.
 
 అన్నీ చక్కదిద్దుకొని తాపీగా...
 ఈ నెల 27 నుంచి రెండు మూడు రోజుల పాటు శాసనసభ జరిపించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదింపజేసుకోవాలని ముఖ్యమంత్రికి ఓ ఆలోచన ఉంది. ఈ లోపు, రాష్ట్రపతికి ఓ లేఖ రాసి, విభజన బిల్లు ముసాయిదాపై చర్చ ఆలస్యంగా మొదలైనందున మరికొంత సమయం కావాలని కోరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి స్పందన ఎలా ఉన్నా, విభజన వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొని, ప్రభుత్వపరమైన కార్యక్రమాలన్నీ కానిచ్చి ఆ పైన తాపీగా రాజీనామా చేసే ఆలోచనతో ఉన్నట్టు ఆదివారం మంత్రి పితాని సత్యనారాయణ చెప్పిన మాటల్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యమంత్రి, తాను రాజీనామా చేయనున్నట్టు పితాని వెల్లడించారు. అదే జరిగి సీఎం ఓ కొత్తపార్టీ ఏర్పాటుచేసినా, అది సమైక్యం కోరే వారి నిందల నుంచి తప్పుకొని రాజకీయాల్లో కొనసాగే కొత్త ఎత్తుగడ అవుతుందే తప్ప నిజాయితీ ఎలా అవుతుందనే ప్రశ్న కాంగ్రెస్ వర్గాలే లేవనెత్తుతున్నాయి. నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న చిత్తశుద్ధే ఉంటే, కీలక సమయంలో ముఖ్యమంత్రి పదవిని త్యజించి, విభజనను ఎందుకు అడ్డుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నినాదం’ కాకపోయినా, ఇదంతా వ్యూహంలో భాగమైన ‘విధానం’ తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ‘సమాధానం’ కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
 

Advertisement
Advertisement