ఆ హామీల విలువ రూ.7,070 కోట్లు | Sakshi
Sakshi News home page

ఆ హామీల విలువ రూ.7,070 కోట్లు

Published Thu, Nov 6 2014 4:21 AM

ఆ హామీల విలువ రూ.7,070 కోట్లు - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తొమ్మిదేళ్ల పాలనలో ఆచితూచీ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అడిగిందే తడువుగా వరాల వర్షం కురిపించేస్తున్నారు. ఆ హామీల అమలును దాటవేస్తూ వస్తున్నారు. రాజధాని ఎంపికపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు సెప్టెంబరు 4న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకుండా ఇప్పటిదాకా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించకపోవడమే అందుకు తా ర్కాణం. బుధవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగాంగా సీఎం చంద్రబాబు కురుబలకోట మండలం అంగళ్లులో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు అడిగినని.. అడగని వాటికీ అమలు ఇచ్చేశారు.

రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీళ్లు.. 30 లక్షల మందికి తాగునీళ్లు అందించే హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ పాక్షికంగా పూర్తయింది. రెండో దశ పూర్తిచేయాలంటే రూ.4,500 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్లో కనీసం రూ.750 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు పరిశీలించి చంద్రబాబు ప్రభుత్వం.. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.100.28 కోట్లనే కేటాయించడ గమనార్హం. ఆ నిధులు కూడా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి.

ఇది చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ.. బుధవారం అంగళ్లు సభలో చంద్రబాబు మాట్లాడుతూ దుర్భిక్ష జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నా.. పశ్చిమ మండలాల ప్రజల దాహార్తి తీర్చాలన్నా హంద్రీ-నీవా ఒక్కటే శరణ్యమన్నారు. రూ.4,500 కోట్లను ఖర్చు చేసి ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తిచేసి.. కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని స్పష్టీకరించారు. ఇది సాధ్యం కావాలంటే ఇప్పటి నుంచి ప్రతి నెలా సగటున రూ.375 కోట్లను హంద్రీ-నీవాకు విడుదల చేయాలి. 2014-15 బడ్జెట్లో రూ.100.28 కోట్లే కేటాయించిన చంద్రబాబు.. ప్రతి నెలా ఒక్క హంద్రీ-నీవాకే రూ.375 కోట్లు ఎలా కేటాయిస్తారన్నది అంతుచిక్కడం లేదు. హంద్రీ-నీవాకు సమాంతరంగా వాటర్ గ్రిడ్‌ను కూడా చేపట్టి పశ్చిమ మండలాల దాహార్తి తీర్చుతామని హామీ ఇవ్వడం గమనార్హం.
 
బెంగుళూరు నుంచి అనంత మీదుగా కుప్పం వరకూ ...
బెంగుళూరు-అనంతపురం-మదనపల్లె-పలమనేరు-కుప్పం మీదుగా రింగ్ రోడ్డును నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే.. ఆలోగా కృష్ణా జలాలను రప్పిస్తే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తోడు ఫార్మాసూటికల్ పరిశ్రమలు కూడా పశ్చిమ మండలాలకు భారీ ఎత్తున తరలివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఉపాధికి కొదువ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. ఈ రింగ్ రోడ్డును నిర్మించాలంటే కనిష్ఠంగా రూ.రెండు వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
 
ఇక మన జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. ప్రస్తుతం రోజుకు 22 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ 400 నుంచి 500 పశువులకు వసతి కల్పించేలా ఊరి బయట హాస్టల్స్ నిర్మించి.. 50 నుంచి 60 ఎకరాల్లో సామూహికంగా పశుగ్రాసాన్ని పెంచి.. మిషన్ల ద్వారా పాలను పితికి డెయిరీలకు విక్రయించి.. పాల ఉత్పత్తిని 50 లక్షల లీటర్లకు పెంచుతామని.. ఇందుకోసం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని చెప్పారు. ఈ పైలట్ ప్రాజెక్టు అమలుకు కనిష్ఠంగా రూ.500 కోట్లు అవసరం అవుతాయని పశుసంవర్ధకశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.

జిల్లాలో టమాట పంటలో పోస్ట్ హార్వెస్టింగ్‌లో సాంకేతిక విధానాలను అందిపుచ్చుకుని.. టమాటాలను కొంత కాలం నిల్వ ఉంచగలిగితే మంచి ధరను పొందవచ్చునన్నారు. ఇందుకోసం టమాట ప్యాకేజీ కింద రూ.పది కోట్లను మంజూరుచేస్తామన్నారు. జిల్లాను హర్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఉన్న ఊరి నుంచే ఆన్‌లైన్‌లో పండ్లను అమ్ముకునే వెసులుబాటును రైతులకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టమాట రైతు రుణాలను మాఫీ చేయాలన్న ప్రజాప్రతినిధుల డిమాండ్‌పై చంద్రబాబు నే రుగా స్పందించలేదు. ఉద్యానపంట కింద ట మోటా వస్తుందని.. రైతులకు న్యాయం చేసేం దుకు ప్రయత్నిస్తామని చెప్పడం గమనార్హం.
 
తంబళ్లపల్లెపై హమీలవాన
తంబళ్లపల్లె నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీ ఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ నిధులు ఎ ప్పటిలోగా విడుదల చేస్తారు.. ఎప్పటిలోగా రో డ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తారన్నది స్పష్టం చేయలేదు. బి.కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు కనీసం రూ.ఐదు కోట్లు అవసరం అవుతాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

బి.కొత్తకోటలో డిగ్రీ కాలేజీని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఇందుకు కూడా కనీసం రూ.ఐదు కోట్లు అవసరం అవుతాయి. మొత్తమ్మీద బుధవారం చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ రూ.7,070 కోట్లకు చేరింది. సెప్టెంబరు 4న చంద్రబాబు శాసనసభలో ఇచ్చిన హామీ విలువ రూ.25 వేల కోట్లకుపైగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. శాసనసభలో సెప్టెంబరు 4న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ అమలుచేసే దిశగా చంద్రబాబు కనీసం ప్రయత్నాలు కూడా చేయకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement