క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన

Published Sat, May 2 2020 3:16 AM

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

టెలి మెడిసిన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలి. వైద్య వ్యవస్థను భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా తీర్చిదిద్దాలి. టెలి మెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ పొందాక, విలేజ్‌ క్లినిక్‌ ద్వారా మందులు సరఫరా చేయాలి. 

లాక్‌డౌన్‌ సడలింపులతో ఇతర దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే వారికి స్క్రీనింగ్, అవసరమైన వారికి క్వారంటైన్‌ విషయంలో అనుసరించాల్సిన విధానంపై పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. క్వారంటైన్‌లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి. అన్ని విషయాల్లోనూ సర్వసన్నద్ధంగా ఉండాలి.   

సాక్షి, అమరావతి: క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు, పరీక్షల సరళి, క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల అనుసరించాల్సిన వైఖరి, కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు, టెలిమెడిసన్‌ అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 


ఎప్పటికప్పుడు స్పందన 
► క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. సదుపాయాలు, పారిశుధ్యం, భోజనం, మందులు తదితర విషయాలపై క్వారంటైన్‌లో ఉన్న వారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. 
► క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ నంబర్‌ తమ వద్ద ఉందని, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌ చేసి, ఇబ్బందులు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు.   
► విదేశాల నుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి, ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని చెప్పారు.    
► రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,02,460 కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించాం. గురువారం ఒక్క రోజే 7,902 పరీక్షలు జరిగాయి.  
► ప్రతి మిలియన్‌కు 1,919 చొప్పున పరీక్షలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రతి మిలియన్‌ జనాభాకు 2 వేలకు చేరువలో పరీక్షలు జరుగుతున్నాయి.   

కోవిడ్‌–19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం 
► కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తామన్నారు.  
► కుటుంబ సర్వేలో హైరిస్క్‌ ఉన్నట్లు గుర్తించిన 4 వేల మందికి పరీక్షలు చేసి, కోవిడ్‌ లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.  
కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. జిల్లాలకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని చెప్పారు.  
► హైరిస్క్‌ ఉన్న వారు శ్వాసకోశతో సంబంధిత సమస్యలతో, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతూ.. ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే 1902, 104 నంబర్లకు కాల్‌ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు.  
ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement