Sakshi News home page

లక్ష క్వారంటైన్‌ బెడ్లు

Published Sun, May 3 2020 2:45 AM

CM YS Jagan Review Meeting With Officials On Quarantine accommodation and agricultural products - Sakshi

విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు పెద్ద సంఖ్యలో వస్తే కొద్ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచడం తప్పనిసరి. అందుకే ముందుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం.ప్రభుత్వం తరఫున ఏయే పంట ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. ఆ మేరకు రోజువారీగా ఎంత కొనుగోలు చేయాలి.. అలా చేస్తున్నారా? లేదా? అనే వివరాలివ్వాలి. కొనుగోలు కేంద్రాల వద్ద, రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచే సాధనాలను అందుబాటులో ఉంచాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు యూనిట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష క్వారంటైన్‌ బెడ్స్‌ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్‌–19 రిస్థితుల కారణంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ అధికార యంత్రాంగంతో సుదీర్ఘంగా చర్చించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, పరీక్షల సరళి, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి తరలి వచ్చే వారికి క్వారంటైన్‌ వసతి, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.     
 
మొబైల్‌ వాహనాల్లో నిత్యావసరాలు 

– కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలి. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి.  
– డాక్టరు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, మందులను ఈ మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలి. 
– కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలి. నిత్యావసరాల కోసం ఇంటికి ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలి.  
శనివారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 


 
కంటైన్‌మెంట్‌ జోన్లలో విధివిధానాలు 
– లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండాలనే దానిని గుర్తించాలి. అక్కడ అనుసరించాల్సిన విధి విధానాలు తయారు చేయాలి.  
– అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ)ను సిద్ధం చేయాలి. 
– క్వారంటైన్లలో సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారా? లేదా? సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియజేయాలి.  
– మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈలోగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని.. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. వీటిని ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)లకు అనుసంధానం చేయాలని సూచించారు.  
 
రైతు భరోసాకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు 
– రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని, ఎవరైనా పేరు లేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మే 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామన్నారు. 
– ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. ఇందులో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలి. వారికి కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తంగా కనీసం ఒక లక్ష బెడ్లు సిద్ధం చేయాలి. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌.. ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్‌–19 క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలి. 

Advertisement

What’s your opinion

Advertisement