రీచ్‌లలో అక్రమాలు లేకుండా చూడాలి: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఇసుకపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Published Fri, Jun 5 2020 7:26 PM

CM YS Jagan Review Meeting On Sand - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఇసుకపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయని, ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని, వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘బల్క్‌ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వండి. డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టండి. పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్లను తొలగించండి. బల్క్‌ ఆర్డర్లకు సంబంధించిన అనుమతులను జేసీకి అప్పగించండి. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలి. ( మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్‌)

పోర్టల్‌ ఆన్‌ చేయగానే.. వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలి. ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్‌ బుకింగ్‌ ఉంటే.. సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలి. డిపోలనుంచే ఇసుక సరఫరా చేయాలి. నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడండి. బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచండి. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని ఉన్న గ్రామాలకు ఎడ్ల బళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని’ ఆదేశించారు.

Advertisement
Advertisement