ఆ నాలుగు జిల్లాల్లో..వేగంగా చర్యలు | Sakshi
Sakshi News home page

ఆ నాలుగు జిల్లాల్లో..వేగంగా చర్యలు

Published Wed, Apr 22 2020 2:48 AM

CM YS Jaganmohan Reddy Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

పంటలకు సంబంధించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. దూకుడుగా కొనుగోళ్లు జరపాలి. రైతులకు అండగా నిలబడాలి. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే రైతుల సమస్యలు చిన్న చిన్నవన్నీ సమసిపోతాయి.  

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ జిల్లాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతరత్రా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, పంటల కొనుగోళ్లు, గుజరాత్‌లో చిక్కుకుపోయిన మన మత్స్యకారుల బాగోగులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇలా..

తొలుత రెడ్, ఆరెంజ్‌ జోన్లలో మాస్క్‌లు
► కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఆ మేరకు చర్యలు వెంటనే తీసుకోవాలి.  
► రెడ్, ఆరెంజ్‌ జోన్లలోని ప్రజలకు ముందుగా మాస్క్‌లు పంపిణీ చేయాలి. 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా పరీక్షలు చేశారు. నిన్న (సోమవారం) ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కోవిడ్‌–19 పరీక్షలు (ర్యాపిడ్‌
టెస్టులు కాకుండా) చేశారు. 
► పీపీఈలు, మాస్క్‌లు అవసరాలకు అనుగుణంగా ఉంచాలి. కేసులు ఎక్కువగా ఉన్నచోట స్టాక్‌ను అధికంగా ఉంచాలి.
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా కూడా పరీక్షలు
► విశాఖపట్నంలో, ఇతర జిల్లాల్లో టెస్టులు బాగా జరుగుతున్నాయని.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదని అధికారులు వివరించారు. ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా ఇక్కడ కూడా పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. 
► కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నందున, ఆ ఆసుపత్రిలో ఉన్న వారిని మిగతా ఆస్పత్రులకు మార్చామని అధికారులు వివరించారు. ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరామని చెప్పారు. 
► సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32 వేల మందిలో ఇప్పటికే 2 వేలకుపైగా పరీక్షలు చేశామని, మిగతా వారందరికీ త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. క్వారంటైన్‌ సెంటర్లలో ప్రస్తుతం 7,100 మంది ఉన్నారన్నారు.
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మత్స్యకారుల కోసం గుజరాత్‌ సీఎంకు ఫోన్‌
గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారుల బాగోగులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. వారికి వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని కోరారు. దీనిపై గుజరాత్‌ సీఎం స్పందిస్తూ.. అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement