నేటి నుంచి వైఖానస ఆగమ సదస్సు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైఖానస ఆగమ సదస్సు

Published Fri, Jul 11 2014 4:38 AM

నేటి నుంచి వైఖానస ఆగమ సదస్సు

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమప్రోక్తంగా నిర్వహించే పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవల విశిష్టతను తెలిపేలా శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు వైఖానస ఆగమ సదస్సు నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల నేతృత్వంలో ఆస్థాన మండపంలో ఈ సదస్సు నిర్వహణకోసం హిందూ ధర్మప్రచార పరిషత్ ఏర్పాట్లు చేసింది. తొలి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఉపన్యాసాలు ఉంటాయి. 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ప్రసంగాలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సమావేశం నిర్వహిస్తారు. సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి వైఖానస ఆగమ పండితులు పాల్గొంటారు. లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం- జిజ్ఞాసాధికరణం, వైఖానసమ తత్త్వచింతన, అష్టాదశ శారీర సంస్కార విశిష్టత, ఉత్తమ బ్రహ్మ విద్య వైఖానస ఆగమం వంటి అనేక అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.
 
15న తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం
 
తిరుమల శ్రీవారి ఆలయంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17వ తేదీన ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 17 తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఆలయంలో 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేస్తారు.

ఈ సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించరు. ఆరోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. ఇక 17వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమల  ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఆ రోజు నుంచే ఆలయ నిర్వహణ లెక్కలు ప్రారంభిస్తారు.
 

Advertisement
 
Advertisement