పందెం పుంజుల ‘ఢీ’ | Sakshi
Sakshi News home page

పందెం పుంజుల ‘ఢీ’

Published Thu, Jan 15 2015 2:22 AM

పందెం పుంజుల ‘ఢీ’

చేతులు మారిన 200 కోట్లు

సాక్షి, విజయవాడ బ్యూరో: సంక్రాంతి పురస్కరించుకుని భోగి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన పందేల్లో భాగంగా రూ.200 కోట్ల మేర సొమ్ము చేతులు మారినట్లు అంచనా. న్యాయస్థానాల ఆదేశాలు ఎలా ఉన్నా.. పలుచోట్ల అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు స్వయంగా బరిలోకి దిగి కోడి పందేలను ప్రారంభించడం గమనార్హం.

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్దయెత్తున పందెంరాయుళ్లు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంప, భీమవరం ఆశ్రమం తోట, ఐ భీమవరం, మహదేవపట్నం, పూలపల్లి, తదితర బరుల్లో పందేలు జోరుగా జరిగాయి. కొన్నిచోట్ల పోలీసుల మోహరింపు కారణంగా కత్తులు కట్టకుండానే పందేలు నిర్వహించారు.కోడి పందేల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత కె. రఘురామకృష్ణంరాజు భీమవరం మండలం వెంపలో కోడి పందేలను ప్రారంభించారు.ఏలూరు ఎంపీ మాగంటి బాబు బరిలోకి దిగి పందేలకు సై అన్నారు. తెలంగాణ నేతలు ప్రకాష్‌గౌడ్, శ్రీశైలంగౌడ్‌లు పందేలను వీక్షించారు.

ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు స్వయంగా బరిలోకి దిగి పందేలు వేశారు. దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు నియోజకవర్గం గుండుగొలనులో ఎమ్మెల్యే గన్ని ఆంజనేయులు పందేలు ప్రారంభించారు. కొవ్వూరు టౌన్‌లో ఎమ్మెల్యే కె.జవహర్ ప్రారంభించారు. హోంమంత్రి  చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెంలో పందేలు నిర్వహించారు. పిఠాపురం పట్టణం వైఎస్సార్ గార్డెన్స్‌లో నిర్వాహకులు టెంట్ల చుట్టూ తెలుగుదేశం జెండాలు కట్టి, ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ యూత్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు, కృష్ణా జిల్లా నున్నలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించారు. మచిలీ పట్నంలో జరిగిన  పందేల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. విజయవాడ గాయత్రీనగర్‌లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ కోడి పందాలను ప్రారంభించారు. పెనమలూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పందేలను  నిర్వహింపజేశారు. గన్నవరం మండలం చిక్కవరంలో ఎస్టీ నాయకుడు బూక్యా కపూర్ నాయక్ కారు అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమైంది.

Advertisement
Advertisement