కమ్మని కాఫీ | Sakshi
Sakshi News home page

కమ్మని కాఫీ

Published Mon, Jul 21 2014 2:10 AM

కమ్మని కాఫీ - Sakshi

  • కాఫీ పంటతో గిరిజనులకు ఆర్థిక ఆసరా
  •  మన్యంలో ఏటా విస్తరిస్తున్న సాగు
  •  పంటకు మేలు చేసిన ముందస్తు వర్షాలు
  •  గింజ దశకు చేరుకున్న కాపు
  •  ఏటా రూ.60 కోట్ల లావాదేవీలు
  • ఏజెన్సీలో కాఫీ పంట సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల నుంచి కాపు ఆశాజనకంగా ఉంది. ఏటా ఆరు ఏడు వేల టన్నులు దిగుబడి వస్తోంది. గతేడాది కాఫీ గింజలకు మద్దతు ధర లభించింది. సుమారు రూ.60 కోట్ల లావాదేవీలు సాగాయి. రైతులు మంచి లాభాలు గడించారు. ఈ క్రమంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది కూడా వాతావరణం అనుకూలించింది. అప్పుడే పంట గింజదశకు చేరుకుంది. నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని గిరిజనులు ఆశిస్తున్నారు.
     
    పాడేరు:  ఏజెన్సీలో కాఫీ పంట సాగు బాగుంది.  కొయ్యూరు మండలంలో 3 పంచాయతీలతోపాటు మిగతా పది మండలాల్లో మొత్తం 1,42,993 ఎకరాల్లో 1,39,017 మంది రైతులు ఈ పంటను చేపట్టారు. ఇందులో లక్షా 19 వేల  ఎకరాల్లో తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి.  ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలు కాఫీతోటలకు ఎంతో మేలు చేశాయి. ఎన్నడూ లేని విధంగా తోటల్లో కాపు గింజ దశకు చేరుకుంది. కేంద్ర కాఫీబోర్డు సహకారంతో ఐటీడీఏ ఏజెన్సీలో ఈ పంటను విస్తరిస్తోంది.

    1975లో కేవలం ఎకరా ప్రాంతంలో ప్రారంభమైన కాఫీ పంట ప్రస్తుతం 1,42,993 ఎకరాలకు విస్తరించింది. 2001వ సంవత్సరం నుంచి ఈ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సహిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనుల ఆర్థిక ఆసరా కోసం కాఫీ ప్రాజెక్టు అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈమేరకు 2001 నుంచి 2009 వరకు 93,521 ఎకరాలకు కాఫీసాగు పెరిగింది. కేంద్ర కాఫీబోర్డు, జాతీయ ఉపాధి హామీ పథకంలో 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 వరకు మరో లక్ష ఎకరాల్లో దీని సాగుకు రూ.319 కోట్ల అంచనాతో ప్రణాళికను అమలు చేస్తున్నారు.

    ఐటీడీఏ, కాఫీ విభాగం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులంతా కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నారు. లాభాలు వచ్చే పంట కావడంతో గిరిజన రైతులు కూడా తమ పోడు, మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా చేపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 9 వేల ఎకరాల్లో ఈ పంటను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు కొందరు రైతులను ఎంపిక చేసి 50 చోట్ల నర్సరీలను పెంచుతున్నారు. వర్షాలు అనుకూలించడంతో నర్సరీల నుంచి సేకరించిన మొక్కలను నాటేందుకు గిరిజన రైతులు సిద్ధమవుతున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement