వణికిస్త్తున్న చలి | Sakshi
Sakshi News home page

వణికిస్త్తున్న చలి

Published Thu, Jan 15 2015 12:03 AM

బుధవారం ఉదయం విజయవాడ కమర్షియల్ టాక్స్ కాలనీలో భోగి మంటలతో చలి కాచుకుంటున్న జనం

పండుగ వేళ మరింత పెరిగిన చలి తీవ్రత
పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలిగాలుల ఉధృతి


సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ చలి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీనికితోడు చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకే ఆరంభమవుతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని నర్సీపట్నం, పాడేరు, సీతంపేట తదితర  ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు కప్పేస్తోంది. బాగా ఎండ వచ్చేవరకూ రహదారులు కూడా కనిపించట్లేదు. విశాఖ జిల్లాలోని లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలకు పడిపోవడంతో అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి తట్టుకోలేక వృద్ధులు చనిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వెళ్లిన భక్తులు చలికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

బుధవారం అనంతపురంలో 12.5, కర్నూలులో 14.6, తిరుపతిలో 16.4, కళింగపట్నంలో 15.4, నెల్లూరులో 18.8, కాకినాడలో 17.6, విజయవాడలో 16.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 11.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది.

తెలంగాణలో 17 మంది బలి
చలి తీవ్రతకు తెలంగాణలో గత 24 గంటల్లో ఏకంగా 17 మంది బలయ్యారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మరణించారు. వృద్ధులు, అనాథలు, రోడ్లపైన నిద్రించేవారు ఎక్కువగా చలి బారిన పడి మృతి చెందుతున్నారు.   ఆదిలాబాద్, భద్రాచలం, ఏటూరునాగారం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అల్లాడిపోతున్నారు.

Advertisement
Advertisement