ఎన్నికల నిర్వహణకు సహకరించండి | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు సహకరించండి

Published Sat, Apr 12 2014 2:29 AM

collaborate with program management

 సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్ నీతూప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్‌లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ఘట్టం శనివారం ప్రారంభమవుతుందన్నారు.
 
 ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరిస్తారని, అయితే మధ్యలో 13, 14, 18 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ రోజులు మినహా మిగిలిన దినాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీకి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ అధికారులకు, పార్లమెంటు స్థానాలకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం కేంద్రాల్లోని ఆయా ఆర్వోల వద్ద నామినేషన్లు దాఖలు చేయాలన్నారు.
 
 21న నామినేషన్ల పరిశీలన, 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఉపసంహరణ  చేసుకోవచ్చన్నారు. ఆరోజే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తామన్నారు. ఆ వెంటనే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించుకోవచ్చన్నారు. మే 7వ తేదీన పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. మే 28వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ వివరించారు.
 
 నామినేషన్లు వేసేదిలా..

పార్లమెంటు స్థానానికి ఫారం-2ఏ, అసెంబ్లీ స్థానానికి ఫారం-2బిలో నామినేషన్ దాఖలు చేయాలి. ఎంపీ అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్ధి రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా ఆర్వోకు నేరుగా కానీ ట్రెజరీ చలాన రూపంలోకానీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ మొత్తంలో సగమే చెల్లిస్తూ, ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ప్రతిపాదకుడు ఒకరు చాలు. రిజిస్టర్‌‌డ పార్టీలు లేదా ఇతరులకైతే పదిమంది ప్రతిపాదకులు కావాలి.
 
అభ్యర్థికి రాష్ట్రంలో ఎక్కడ ఓటున్నా ఆ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ప్రతిపాదకులకు మాత్రం తప్పనిసరిగా అభ్యర్థి ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారో.. అదే నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండాలి. నామినేషన్ ఫారంతో పాటు అభ్యర్థి ఫారం-26 అఫిడవిట్‌ను రూ.10 విలువ కలిగిన స్టాంపు పేపరుపై నోటరీ చేయించి సమర్పించాలి. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూరించాలి. ఖాళీగా వదిలితే నామినేషన్‌ను తిరస్కరిస్తారు.
 
 కొత్త బ్యాంకు అకౌంటు
నామినేషన్‌కు ముందుగానే అభ్యర్థి స్వయంగా లేదా ఏజెంటుతో కలిసి కొత్త బ్యాంకు అకౌంటు ప్రారంభించాలి. అప్పటి నుంచి ఎన్నికల ఖర్చును అదే అకౌంటు ద్వారా లావాదేవీలు జరపాలి. అకౌంటు వివరాలను, పాస్ బుక్ నకలును ఆర్వోకు అందించాలి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. లెక్కింపు పూర్తయిన తరువాత నెల రోజుల లోపు అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలను వ్యయ పరిశీలకులకు తప్పనిసరిగా సమర్పించాలి.
 
అనుమతుల కోసం ప్రత్యేక విభాగం

నియోజకవర్గ కేంద్రాల్లో ఈసారి రాజకీయ పార్టీలకు లేదా అభ్యర్థులకు ప్రచారం కోసం ర్యాలీలు, ఊరేగింపులు, వాహనాల పర్మిషన్లు వేగంగా ఇచ్చేందుకు సింగిల్ విండో పర్మిషన్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్‌లో అన్ని శాఖల లైజన్ అధికారులు ఉంటారు. అభ్యర్థులు 48 గంటల ముందు ప్రతి అంశానికీ వేర్వేరుగా అనగ్జర్-16లో అభ్యర్థనను అందిస్తే వాటిపై అనుమతులు ఇచ్చేదీ, లేనిదీ 36 గంటల్లో తెలియజేస్తారు. డీఆర్వో బి.యాదగిరి, కాంగ్రెస్ నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి నున్న దొరబాబు, బీజేపీ నుంచి వేటుకూరి సూర్యనారాయణరాజు, బీఎస్పీ నుంచి చొల్లంగి వేణుగోపాల్, సీపీఐ తరఫున పీఎస్ నారాయణ, సీపీఐ ఎంఎల్ తరఫున జె. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement