మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ

Published Thu, Jan 30 2020 4:21 AM

A collection of signatures in support of the three capitals - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు బుధవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, మేధావులు, లాయర్లు, తదితరులు భారీ ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా బుధవారం విజయనగరం పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేశారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి మద్దతుగా విశాఖలో సంతకాల సేకరణ జరిగింది. వైఎస్సార్‌సీపీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ హాజరై మొదటి సంతకం చేశారు. ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, అక్కరమాని విజయనిర్మలతోపాటు విద్యార్థులు, యువకులు సంతకాలు చేశారు. 

ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో..
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థుల సంతకాలను సేకరించారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలో వలంటీర్లకు ఎంపీ మార్గాని భరత్‌ అవగాహన కల్పించారు. మూడు రాజధానులకు మద్దతుగా రాజమహేంద్రవరం ఆల్కాట్‌ తోట, ఐదుబళ్ల మార్కెట్‌ సెంటర్, దేవీచౌక్‌లో సంతకాల సేకరణ జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ సంతకాల సేకరణ చేపట్టారు. తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ నేతల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున ప్రజలు సంతకాలు చేశారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గుంటూరు అరండల్‌పేటలో సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు.

రాయలసీమలో ముమ్మరంగా సంతకాల సేకరణ
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో బుధవారం కడప ఏడురోడ్ల కూడలిలో సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేశ్‌ బాబు ముఖ్య అతిథిగా హాజరై సంతకాల సేకరణను ప్రారంభించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అనంతపురం జిల్లా ప్రజానీకం మద్దతు తెలిపింది. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం, హిందూపురం, ధర్మవరంలలో నిర్వహించిన సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు, మేధావులు, లాయర్లు, వైద్యులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా సంతకాలు చేశారు. తిరుపతి ఎస్వీయూలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మూడు రాజధానులకు మద్దతుగా సంతకాలు చేశారు. 
విశాఖలో.. 

పాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి
మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
తిరుపతి కల్చరల్‌/ఇచ్ఛాపురం/కొవ్వూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు చేపట్టాయి. ఈ ర్యాలీల్లో ప్రజలు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొని పాలనా వికేంద్రీకరణకు మద్దతు పలికారు. మూడు రాజధానులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ‘మూడు రాజధానులు ముద్దు.. అమ్మ ఒడికి స్వాగతం.. మాకు ఇంగ్లిష్‌ మీడియం కావాలి’ అనే నినాదాలతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో కూడిన ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. టౌన్‌ క్లబ్‌ వద్ద మానవహారం చేపట్టి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను ప్రకటించారని తెలిపారు. పాలనా వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకొని చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు ఆయన రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లదేనని ధ్వజమెత్తారు. కాగా, చిత్తూరులోని ఎస్వీసెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తమరెడ్డి, విద్యావేత్త రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.
తిరుపతిలో.. 

శ్రీకాకుళం జిల్లాలో భారీ బైక్‌ ర్యాలీ
మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఇచ్ఛాపురంలో బుధవారం పార్టీ శ్రేణులతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. 

కొవ్వూరులో మంత్రి వనిత ఆధ్వర్యంలో ర్యాలీ
మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ చేపట్టాయి. 

Advertisement
Advertisement