పని చేయకపోతే సెలవుపై వెళ్లండి! | Sakshi
Sakshi News home page

పని చేయకపోతే సెలవుపై వెళ్లండి!

Published Thu, Dec 27 2018 8:20 AM

Collector Dhanunjay Reddy Slams Officials in Srikakulam - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:కాలం గడుస్తున్నా ప్రగతి కనిపించడం లేదు.. సమావేశాలకు సైతం ఆలస్యంగా వస్తున్నారు.. పని చేయాలని ఇష్టంలేకపోతే సెలవుపై వెళ్లిపోండి.. కొత్తగా వచ్చేవారైనా పనులను పూర్తి చేస్తారని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి పలు శాఖల అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. జిల్లాలోని పలు విభాగాల్లో పనుల ప్రగతి లేదని, గత నెలకు ఈ నెలకు ఏమాత్రం మెరుగుదల కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ప్రగతిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో కథలు చెప్పవద్దని, ఇప్పటికే పలుమార్లు కథలు వింటూ వస్తున్నానని.. ఇక నుంచి వినేది లేదన్నారు. ప్రధానంగా పీఆర్‌ ఇంజినీరింగ్, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, ఐటీడీఎస్,  విద్యాశాఖ, ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈనెల 29న అమరావతిలో కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని శాఖల వారీగా ప్రగతిపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం బుధవారం తన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి కొంతమంది అధికారులు ఆలస్యంగా రావడాన్ని గమనించిన కలెక్టర్‌ సమావేశానికి బొట్టుపెట్టి పిలవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్నంవెనుకబడి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి.. పగలు కష్టపడి, పనులకు కావాల్సిన అనుమతులు ఇస్తుంటే ఎందుకు పని చేయడంలేదని అధికారులను ప్రశ్నించారు. చాల శాఖలకు పనులు సజావుగా జరిగేందుకు వీలుగా అడ్వాన్సు కూడా ఇచ్చామని, అయినా పనులు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అధికారులు సమావేశాలకు సమాచారం లేకండా వస్తున్నారని, ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిత్లీ తుపానుకు సంబంధించిన బిల్లులు సైతం కొంతమంది అధికారులు దొంగ బిల్లులు కొన్ని మండలాల్లో పెడుతున్నారన్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో ఏడాదిగా జిల్లా  వెనుకబడి ఉందని, ప్రతి నెలా వెనుకబాటు తనానికి కారణమేమిటని ఆయన డీఆర్‌డీఏ పీడీని ప్రశ్నించారు. ఇక నుంచి సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభా గం ఇంజినీరు తీరుపై మండి పడ్డారు. రన్నింగ్‌ వాటర్‌ సప్‌లై, మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి నెలరోజులుగా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదన్నారు. అడ్వాన్సులు ఇచ్చినా పనులు చేయడం లేదన్నారు.

పాఠశాలలకు, అంగన్‌వాడీ భవనాలకు  ఇంతవరకు ఎందుకు రన్నింగ్‌వాటర్‌ను సరఫరా చేయలేదని సంబంధితశాఖ ఈఈని కలెక్టర్‌ నిలదీశారు. అంగన్‌వాడీ భవనాల్లో సమస్యలుంటే తనకు ఎందుకు చెప్పడం లేదని, పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదని ఐటీడీఎస్‌ అధికారులను ప్రశ్నించారు. అన్ని శాఖల్లోనూ ఇంజినీరింగ్‌ విభాగాలు అధ్వానంగా ఉన్నాయని,  ప్రగతి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. తీరు మారాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఒకే పనిని పదేపదే చెప్పించుకోవడం సరికాదన్నారు. ఆదరణ పథకానికి సంబంధించిన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని, మండలాభివృద్ధి అధికారులు, ప్రత్యేకాధికారుల దగ్గర జాప్యం జరుగుతోందన్నార. మీ లాగెన్‌లో ఎందుకు అన్ని రోజులు ఉంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఎప్పు డు వచ్చిన దరఖాస్తులను అప్పుడే  పంపించాలన్నారు. మేదరి, రజక, కల్లుగీత తదితర వర్గాలకు నేరుగా రూ.

పది వేలు వంతున చెక్కులు చెల్లించాల్సి ఉండగా.. ఇందులో ఎంపీడీవోల జాప్యం ఉందన్నారు. ఉపాధి హమీ నిధులతో సంబంధం ఉన్న  వివిధ శాఖల పనులు వేగవంతం చేయాలని, నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే నష్టం జరుగుతోందని కలెక్టర్‌ ధనంజయరె డ్డి అన్నారు. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధరబాబు, జేసీ–2 పి రజనీకాంతరావు, డీఆర్‌డీఏ పీడీ జి.సి.కిశోర్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగేంద్ర ప్రసాద్, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, జెడ్పీ సీఈవో బి. నగేష్, ఆర్డీవోలు ఎం.వి.రమణ, ఎస్‌.వెంకటేశ్వర్లు, ఆర్‌. గున్నయ్య పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement