కలెక్టర్‌తో ఢీ | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌తో ఢీ

Published Thu, Jan 28 2016 12:03 AM

Collector Nayak war on jp Chairperson

ఉపాధి నిధులతో రోడ్లకు ప్రతిపాదించిన కలెక్టర్ నాయక్
  ఆయన పెత్తనాన్ని సహించలేకపోతున్న చైర్‌పర్సన్ శోభారాణి
  ముఖ్యమంత్రికి... రాష్ట్ర మంత్రికీ ఫిర్యాదులు
  గతంలోనూ మంత్రి మృణాళిని, ఎమ్మెల్సీ జగదీష్‌తోనూ రగడ
  వారితోనూ ఉపాధి నిధులపైనే యుద్ధం
 
 జెడ్పీ చైర్‌పర్సన్ ఉపాధి నిధుల పనులకోసం యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్‌ను ప్రత్యక్షంగా ఢీకొంటున్నారు. ఆ మాటకొస్తే... ఆమె స్వపక్షీయులతో... అంటే సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి మృణాళిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్‌తోనూ పోరాడారు. అదీ ఉపాధి నిధులపైనే... అసలు వీటిపైనే ఆమె ఎందుకు అంత పట్టుబడుతున్నారనేదే చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రావకపోవడమా...? ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులు తప్ప మరే అవకాశమూ లేకపోవడమా...?
 
  సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదవి అన్నాక పెత్తనం ఉండకపోతే ఎలా? ఏదో ఒకటి చేయకపోతే ఎవరు పట్టించుకుంటారని అనుకున్నారో ఏమో తెలియదు గాని ఉపాధి హామీ పథకం మెటీరియల్ పనుల విషయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కలెక్టర్‌తో యుద్ధం చేస్తున్నారు. తమ ఆమోదం లేకుండా, జెడ్పీ తీర్మానం తీసుకోకుండా మెటీరియల్ కాంపోనెంట్ పనులను మంజూరు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఈ పనులు జోరుగా సాగడం లేదని, సుమారు రూ. 200కోట్లు ఖర్చు కాకపోవడంవల్ల వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందని, అటు సీఎం, ఇటు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో కలెక్టర్ పనులు మంజూరు చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
 కలెక్టర్‌కు ఆ అధికారం లేదంటూ వాదన
 కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనులను మాత్రమే కలెక్టర్‌కు మంజూరు చేసే అధికారాన్ని ఇచ్చారని, పూర్తిస్థాయి ఉపాధి మెటీరియల్ నిధులతో చేపట్టే పనులకు మంజూరు అధికారం లేదని జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి మెటీరియల్ పనుల విషయంలో మంజూరు చేసే పూర్తి అధికారాలు కలెక్టర్‌కు ఉన్నాయని, పనుల మంజూరు విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని అధికార వర్గాలు చెబుతున్నాయి. పైగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుంటే సంతోషించాలే తప్ప అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోని జెడ్పీ చైర్‌పర్సన్ సీఎం, మంత్రుల దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేశారని మొర పెట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జెడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.
 
 గతంలోనూ ఇదే తీరు
 గతంలో మంత్రి కిమిడి మృణాళినితో నువ్వానేనా అన్నట్టు ఢీకొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పోరు సాగించారు. గతేడాది జనవరిలో ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల కేటాయింపు విషయంలో మంత్రి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి మధ్య పెద్ద వివాదమే నడిచింది. రూ.35కోట్లతో చేపట్టే ఈ పనులకోసం జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి మండలాల వారీగా కేటాయించి, ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లను కోరారు. మరోవైపు మంత్రి మృణాళిని కూడా మండలానికి రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. విషయం తెలుసుకున్న జెడ్పీచైర్‌పర్సన్ సీరియస్‌గా స్పందించారు.  ఉపాధి పనుల కేటాయింపులో మంత్రి పెత్తనమేంటని, తాను వేరేగా నాయకుల నుంచి  పనుల ప్రతిపాదనలు తీసుకోవడమేంటని మండిపడ్డారు. తమ శాఖ పరిధిలోకి వచ్చే నిధుల కావడం వల్లనే ప్రతిపాదనలు తీసుకున్నామని మంత్రి సమర్ధించుకున్నప్పటికీ వారిద్దరి మధ్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగింది.
 
 జగదీష్‌తో ఒకసారి
 మంత్రితో పోరు సద్దుమణిగిన కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో ఇవే పనుల విషయంలో రగడ చోటు చేసుకుంది. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.5.29కోట్లు విలువ గల 30 పనుల్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రతిపాదించారు. కలెక్టర్‌కు తమ ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సై అన్నారు. తనకు తెలియకుండా, తన ద్వారా కాకుండా ఉపాధి పనుల్ని జగదీష్ ప్రతిపాదించడాన్ని చైర్‌పర్సన్ స్వాతిరాణి జీర్ణించుకోలేకపోయారు. జగదీష్‌తో పరోక్షంగా పోరుకు దిగారు. మొత్తమ్మీద స్వాతి రాణి పోరాటం ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement