కలెక్టర్‌ వీడ్కోలుకు అయ్యన్న దూరం | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వీడ్కోలుకు అయ్యన్న దూరం

Published Mon, Jan 21 2019 6:49 AM

Collector Praveen Kumar Farewell party - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వీడ్కోలు సభకు జిల్లా సీనియర్‌ మంత్రి సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ జిల్లా కలెక్టర్‌ అయినా బదిలీపై వెళ్తుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలకడం ఆనవాయితీ. అలాంటిది ఏకంగా ఆరేళ్ల పాటు జిల్లాలో పనిచేసిన కలెక్టర్‌ వీడ్కోలు సభకు మంత్రి అయ్యన్న హాజరు కాలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగున్నరేళ్లపాటు ఆయన జిల్లాలోనే వివిధ హోదాల్లో సేవలందించారు. జేసీగా, జీవీఎంసీ కమిషనర్‌గా, గడిచిన రెండున్నరేళ్లుగా కలెక్టర్‌గా పనిచేసి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగలిగారు. కానీ ఆది నుంచి ప్రవీణ్‌కుమార్‌పై మంత్రి గంటాకు అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడింది. దీంతో గంటాను విబేధించే అయ్యన్నపాత్రుడు  సహజంగానే ప్రవీణ్‌ కుమార్‌ను అడపాదడపా విమర్శిస్తుండే వారు. ముఖ్యంగా విశాఖ ఉత్సవాలు, సంబరాల పేరిట కో ట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబా రా చేస్తున్నారంటూ మండిపడేవారు. ఆ కారణంగానే గడిచిన నాలుగేళ్లుగా జరిగిన విశాఖ ఉత్సవాల్లో ఏ నాడూ అయ్యన్న పా ల్గొన్న దాఖలాలు లే వు.

అంతేకాదు ము ఖ్యమంత్రి, టీడీపీ సీనియర్‌ మంత్రులు వచ్చినప్పుడు తప్ప జిల్లా సమీక్షలకు కూడా అయ్యన్న దూరంగానే ఉండేవారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో జేసీగా ప్రవీణ్‌కుమార్‌ను జిల్లాకు గంటాయే తీసుకొచ్చారు. ఆ తర్వాత గంటా ఒత్తిడితోనే జీవీఎంసీ కమిషనర్‌గా, ఆ తర్వాత కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందన్న వాదనలున్నాయి. దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు జిల్లా స్థాయిలో వీడ్కోలు సభ శుక్రవారం సాయంత్రం దసపల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం మంత్రి గంటాయే దగ్గరుండి నడిపించారు. కలెక్టర్‌గా ప్రవీణ్‌ సేవలను మంత్రి గంటాతో సహా సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. కానీ ఈ సభకు మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మరోమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, అయ్యన్న అనుంగ అనుచరుడు వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement