అలక్ష్యం | Sakshi
Sakshi News home page

అలక్ష్యం

Published Mon, Nov 24 2014 1:24 AM

అలక్ష్యం - Sakshi

ఒక్క పైసా కట్టొద్దు..నేను అధికారంలోకి వచ్చేస్తున్నా.. మీ కష్టాలన్నీ తీర్చేస్తా.. మీ అప్పులన్నీ అణాపైసలతో సహా మాఫీ చేస్తానంటూ  చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం ఊదరగొట్టేశారు. తీరా పగ్గాలు చేపట్టగానే అబ్బే మాఫీ కాదు..లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ గ్రాంట్‌కు కూడా దిక్కులేదు. సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇస్తామంటూ మాఫీకి మంగళం పాడి డ్వాక్రా సంఘాలపై శఠగోపం పెట్టారు.
 
* కొత్త రుణాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్న బ్యాంకర్లు
* స్త్రీ నిధి రుణాలదీ అదే తీరు  
* మైక్రో ఉచ్చులో డ్వాక్రా మహిళలు
* గగ్గోలు పెడుతున్న నిరుపేదలు
* రుణమాఫీ పుణ్యమాని పేరుకుపోయిన బకాయిలు

సాక్షి, విశాఖపట్నం: ఇటుక మీద ఇటుక కడుతూ ఇల్లు నిర్మించాలంటే ఆరేడు నెలలు పడుతుంది.. అదే ఇల్లు కూలగొట్టాలంటే కనురెప్పకాలం చాలు. ఇప్పుడు అదే తీరులో ఉంది డ్వాక్రా పొదుపు ఉద్యమం. మూడున్నర దశాబ్దాలుగా నిర్మితమైన ఈ ఉద్యమం సర్కారు తీరుపై కుప్ప కూలే పరిస్థితి ఏర్పడింది. కొండలా పేరుకుపోయిన రుణ బకాయిలు ఒక వైపు.. కొత్త అప్పులు పుట్టక ఆర్థిక ఇబ్బందులు మరో వైపు..వెరసి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు, మైక్రో సంస్థల ఉచ్చులో నిరుపేద మహిళలు చిక్కుకునేలా చేసింది. జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటిలో విశాఖ రూరల్ జిల్లా పరిధిలో 45,500 సంఘాలుంటే జీవీఎంసీ పరిధిలో 18,900 సంఘాలున్నాయి.

ఇక నర్సీపట్నం, యలమంచిలి పట్టణాల్లో మరో 2,040 సంఘాలున్నా యి. వీటి పరిధిలో సుమా రు ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని సంఘాలకు రూ.260 కోట్లు, విశాఖ రూరల్ జిల్లా పరిధిలో రూ.620 కోట్లు, మెప్మా (నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీలు) పరిధిలో మరో ఆరు కోట్ల బకాయిలున్నాయి. ఈ రుణాలన్నీ మాఫీ అయిపోతాయని ఆయా సంఘాలు ఇన్నాళ్లు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం కాస్తా 14 శాతం వడ్డీతో వెయ్యి కోట్లు దాటి పోయిందని అంచనా. మొత్తం బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు.

కొన్ని బ్యాంకులైతే మరొకడుగు ముందుకేసి సంఘాల పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును జమచేసుకుంటున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ బకాయిలు చెల్లించండి.. లేదా వడ్డీ అయినా చెల్లించండంటూ లేకుంటే ఎంతకాలం ఎదురు చూస్తాం.. అంటూ నిలదీస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటే ఈవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం ప్రకటిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ మీ అకౌంట్‌లో జమవుతుంది కదా.. అప్పటివరకు ఎదురు చూస్తే మీ రుణాలపై వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది..తక్షణమే చెల్లించండి లేకపోతే మీకే ఇబ్బంది అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు.

ఇటీవల విశాఖ కైలాసగిరిలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబును మహిళా సంఘాలు నిలదీస్తే మీ మ్యాచింగ్ గ్రాంట్ కోసమే ఆలోచిస్తున్నాం.. అందకా ఒక్కొక్క సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేయమని చెప్పాను..ఈ లోగా మీ రుణాలు చెల్లించేయండి అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 
పది శాతం దాటని లక్ష్యం
ఈ ఆర్థిక సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో రూ.155 కోట్లు, మెప్మా పరిధిలో రూ.19 కోట్లు, విశాఖ రూరల్ జిల్లా పరిధిలో రూ.581 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా కనీసం 10 శాతం రుణ లక్ష్యం కూడా దాటని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జీవీఎంసీ పరిధిలోని సంఘాలకు రూ.48 కోట్లు రుణాలు ఇస్తే, రూరల్ జిల్లా పరిధిలోని సంఘాలకు రూ.51 కోట్లు, మెప్మా పరిధిలోని సంఘాలకు రూ. 5 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. ఈ లెక్కన రూ.755కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా,ఇప్పటి వరకు అతికష్టమ్మీద రూ.104 కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వగలిగారు.  

ఇక మిగిలింది నాలుగునెలలు మాత్రమే. ఆర్థికసంవత్సరం ముగిసేలోగా రూ.650 కోట్ల రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే. మరో పక్క కుటుంబ అవసరార్థం సంఘాల పరిధిలో రుణాలు తీసుకునే అవకాశం ఉన్న స్త్రీ నిధి రుణాల పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది కేవలం 262 సంఘాలకు రూ.2 కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. మరో పక్క ఈ రుణాలకు కూడా ప్రస్తుతం 14 శాతం వడ్డీ వసూలు చేస్తుండడం వీరికి పెనుభారంగా పరిణమించింది.
 
పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు
పాపం ‘బాబు’ మాయమాటలు నమ్మి డ్వాక్రా మహిళలు   పదినెలలుగా వాయిదాలు చెల్లించడం మానేశారు. దీంతో వడ్డీ లేని రుణం కాదు కదా కనీసం పావలా వడ్డీ రాయితీని కూడా కోల్పోయారు. ఇప్పుడు 14 శాతం వడ్డీతో బకాయి మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కి  ఆర్నెల్లు దాటింది. రుణాలు మాఫీ కాలేదు.. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ జమకాలేదు. ఒక పక్క బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త రుణాలు మంజూరు చేయబోమని బ్యాంకర్లు తెగే సి చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో డ్వాక్రా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నారు.
 
ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు
ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీ బాదుడుకు జడిసి  ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల నిమిత్తం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.  వారికి అవసరం ఉన్నా లేకున్నా ఇళ్లకు వెళ్లి మరీ రుణాలందించడం మొదలు పెట్టారు.

ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బేషరతుగా రుణమాఫీ అమలుచేయాలని లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమకు ఆత్మహత్యలే శరణ్యమని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రుణమాఫీ చేయడం లేదా..నిర్దిష్ట గడువులోగా రూ. లక్ష చొప్పున మ్యాచింగ్ గ్రాంట్‌యినా రిలీజ్ చేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
రూ.2లక్షలు బాకీ ఉన్నాం
డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఐదు నెలలు వాయిదాలు చెల్లించలేదు. దీనివల్ల మా గ్రూ పులో ఇంకా ఇచ్చిన రుణంలో అస లు రూ.2 లక్షలు ఉండిపోయింది. దీనికి రూ.30 వేల వరకు వడ్డీ పడుతోందని చెబుతున్నారు. ఇలా అయి తే బయట వడ్డీలకు తెచ్చి రుణాలు చెల్లించడమే.
 -కాగిత అంబిక, మాకవరపాలెం

Advertisement
Advertisement