ఉచితానికి మెలిక | Sakshi
Sakshi News home page

ఉచితానికి మెలిక

Published Mon, Apr 18 2016 1:15 AM

Commercial for more than seven hours of electricity tariff quote

ఏడు గంటలకు పైగా విద్యుత్ వాడుకుంటే  కమర్షియల్ చార్జీలు
ఇదెక్కడి న్యాయమంటున్న రైతులు
డబ్బులు చెల్లిస్తే ప్రత్యేక లైన్లు వేస్తామంటున్న విద్యుత్ శాఖ
అయోమయంలో  అన్నదాతలు

 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు తిక్కపుట్టిస్తున్నాయి. వ్యవసాయం వదిలేసి పారిపోదామనే భావన వారికి కలుగుతోంది. ఏడు గంటల ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఏపీఎస్‌పీడీసీఎల్ ఇచ్చిన ఉత్తర్వుతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఉండడంతో కొందరు రైతులు ఏడు గంటలకు పైగానే విద్యుత్‌ను వాడుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో మోటార్లకు సర్కారు మీటర్లు పెట్టి ఏడు గంటల వినియోగం దాటితే కమర్షియల్ చార్జీలు వసూలుచేయడం వివాదాస్పదమైంది.

 

రైతుల తరఫున పోరాటం
రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని, దీనిపై పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును రద్దుచేసి  ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వాలని ఏపీ తెలుగునాడు పట్టభద్రుల సమాఖ్య (ఏపీటీఎన్‌జీఎఫ్) రాష్ట్ర కమిటీ సభ్యుడు గరిమెళ్ల సాంబశివరావు డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పై డబ్బులు వసూలు చేయడమే కాకుండా కమర్షియల్ కింద రైతును గుర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 

విజయవాడ : 24 గంటలు విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతాల్లో రైతుల పొలాలకు ఇచ్చే విద్యుత్‌ను వాడుకునేందుకు ఏడు గంటల విద్యుత్ వినియోగాన్ని నమోదు చేసే ఆటోమేటిక్ మీటర్లను సర్కారు రైతుల మోటార్లకు బిగించింది. ఈ మీటర్లలో ఏడుగంటల పాటు విద్యుత్ సరఫరాను ఉచితంగా ఆమోదించి ఆ తరువాత ఉపయోగించే విద్యుత్‌కు బిల్లులు వసూలుచేస్తున్నారు. అక్కడక్కడ మీటర్లు మరమ్మతుకు గురైతే బాగుచేయడం లేదు. అక్కడి రైతులను కమర్షియల్ జోన్‌లోకి తీసుకొని యూనిట్‌కు రూ. 9.33 వసూలు చేస్తున్నారు. రైతులు ఎవరైనా ఏడు గంటలు దాటి విద్యుత్‌ను వాడుకుంటే అందుకు అదనంగా బిల్లులు చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ  చార్జీలైతే ఫర్వాలేదు కానీ కమర్షియల్ చార్జీలు వసూలు చేయడం దారుణమని అన్నదాతలు అంటున్నారు.

 
కమర్షియల్ బిల్లు చెల్లించండి

ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే ప్రాంతాల్లోని రైతుల పొలాల విద్యుత్ కనెక్షన్‌లకు కమర్షియల్ బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. 2015 జనవరి 31న మెమో నంబర్: సీజీఎం/ఓపీఎన్/డీఈ/సీవోఎంఎంఎల్/ఎఫ్/, డి.నం: 106/15తో ఇచ్చిన ఆదేశాలు రైతుల  జీవితాల్లో చీకట్లు నింపాయి. ఏడు గంటలు విద్యుత్ వాడుకున్న తరువాత వారు అదనంగా వినియోగించే యూనిట్లకు అదనంగా బిల్లులు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.

 
వేలకు వేల బిల్లులు

24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లోని రైతులకు వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. ఉచిత విద్యుత్ పాలసీ ఇక్కడ అమలు జరగడం లేదు. రైతులకు ఉచితంగా ఏడు గంటలు నిరంతరాయ విద్యుత్ ఇస్తామని, తొమ్మిది గంటలు కూడా విద్యుత్ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని గొప్పలు చెప్పిన సీఎం రైతుల నుంచి అదనపు బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారనేది చెప్పాల్సి ఉంది. కొండపల్లి గ్రామానికి చెందిన జి.వెంకటవిజయ అనే మహిళా రైతు తన పొలానికి నెలకు ఐదు వేల నుంచి ఆరువేల వరకు బిల్లు చెల్లిస్తున్నారు. గత డిసెంబరు బిల్లును పరిశీలిస్తే ఆ నెలకు రూ. 4174   బిల్లు వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం రైతుల నుంచి వేలకు వేలు విద్యుత్ బిల్లుల రూపంలో వసూలుచేస్తోంది.

 

డబ్బులు కడితే ప్రత్యేక లైన్లు
ఏడు గంటలు విద్యుత్ సరఫరాకు ప్రత్యేక లైన్లు వేసేందుకు డబ్బులు చెల్లిస్తే 24 గంటల విద్యుత్ ఫీడర్ల నుంచి సపరేట్ చేసి ప్రత్యేకంగా ఏడు గంటల ఫీడర్లు ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు రైతులకు చెబుతున్నారు. ఒక రైతు ప్రత్యేక ఫీడర్‌లైన్ తీసుకోవాలంటే కనీసం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తం చెల్లించి ప్రత్యేక లైన్ వేయించుకునే స్థోమత  లేదని రైతులు వాపోతున్నారు.



అదనపు వాడకానికి  డబ్బులు చెల్లించాల్సిందే : ఎస్‌ఈ
24 గంటలు విద్యుత్ ఉండే ప్రాంతాల్లో ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ను వాడుకున్న తరువాత అదనంగా వాడుకునే విద్యుత్‌కు రైతులు బిల్లులు చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయకుమార్ చెప్పారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇది తప్పదన్నారు. ఉచిత విద్యుత్ వినియోగించుకునే రైతులు వారు ఏడు గంటలు వాడుకున్న తరువాత అదనంగా వాడుకునే ప్రతి యూనిట్‌కు రూ. 3.34 చెల్లించాల్సిందేనన్నారు.

 

Advertisement
Advertisement