పోలీసు స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

పోలీసు స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం

Published Mon, Aug 11 2014 12:10 AM

పోలీసు స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం - Sakshi

కడియం : అకారణంగా తనను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ఆరోపిస్తూ మండలంలోని దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లే వీర్రాజు  పోలీస్‌స్టేషన్ వద్ద  ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు వీర్రాజు, అతడి భార్య నవామణిల కథనం ప్రకారం... కడియపులంక సర్పంచ్ వారా పాపారాము వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వీర్రాజు శనివారం రాత్రి 1.30 గంటల సమయంలో డ్యూటీ చేసి ఇంటికి వెళుతూ కడియం వంతెనపై టిఫిన్ చేసేందుకు ఆగాడు. అయితే అప్పటికే హోటళ్లు మూసివేయడంతో కొద్దిసేపు అక్కడే నిల్చున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కానిస్టేబుళ్లు ఎవరు నువ్వు? ఇక్కడున్నావేంటి? అని అతడిని ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని తెల్లవార్లూ స్టేషన్‌లోనే ఉంచారు. ఆదివారం ఉదయం ఇంటికి పంపించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వీర్రాజు తన భార్య, కుమారుడితో ఆదివారం స్టేషన్ వద్దకు వచ్చి ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకునే  ప్రయత్నం చేశాడు. ఇంతలో పోలీసులు అప్రమత్తమై అతడి వద్ద నుంచి అగ్గిపెట్టె లాక్కొని నీళ్లు చల్లారు.
 
 పోలీసులు దురుసుగా ప్రవర్తించారు...
 ఈ సందర్భంగా వీర్రాజు, నవామణి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... తాను పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాననే విషయాన్ని కనీసం తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వీర్రాజు కన్నీటిపర్యంతమవుతూ ఆరోపించారు. తక్షణం సంబంధిత పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వీర్రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు దళితనాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డీఎస్‌ఏపీఎస్ అధ్యక్షుడు చింతపర్తి రాంబాబు, నాయకులు విప్పర్తి ఫణి, దమ్ము కృష్ణంరాజు, ధోనిపాటి వందనం, కనికెళ్ల బుల్లియ్య, బొచ్చే ఏసురాజు స్టేషన్‌కు చేరుకుని వీర్రాజును వారించారు. సంబంధిత సిబ్బందిని తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై టి. నరేష్ హామీ ఇవ్వడంతో వీర్రాజును తీసుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
 అడ్రస్ చెప్పకే తీసుకొచ్చారు..
 సంఘటనపై ఎస్సై టి. నరేష్ మాట్లాడుతూ వంతెనపై ఉన్న వీర్రాజు సరైన సమాధానం చెప్పకపోవడంతో తమ కానిస్టేబుళ్లు చిట్టిబాబు, సుబ్రహ్మణ్యం అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. అతడి చిరునామాను పరిశీలించి ఉదయాన్నే స్టేషన్ నుంచి పంపేశామని పేర్కొన్నారు. అయితే వీర్రాజు ఆరోపణల నేపథ్యంలో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement