వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Sun, Feb 4 2018 7:54 AM

Common Man brutal murder in nellore district - Sakshi

నెల్లూరు(మినీబైపాస్‌): కుటుంబ కలహాలో మరే ఇతర కారణమో తెలియదు కానీ ఓ వ్యక్తిని నాపరాయితో తలపై మొది దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శనివారం వినాయక థియేటర్‌ సమీపంలో వెలుగులోకి వచ్చింది. చెన్నై ఎంఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ ఖద్దూస్‌ (42), మొబీనా  దంపతులు. వీరికి ఆజ్రు, అష్రఫ్‌ కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఖుద్దూస్‌ 12 ఏళ్లుగా భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. సుమారు రెండేళ్లుగా నెల్లూరు నగరంలో ఉంటూ చికెన్‌ దుకాణల్లో రోజు వారి కూలీగా పనిచేసే వాడు. పని చేయగా వచ్చిన సొమ్ముతో పూటుగా మద్యం తాగి దుకాణాల వద్దనే ఆరు బయట నిద్రించేవాడు.

 ఈ క్రమంలో అతనికి చిత్తుకాగితాలు ఏరుకునే వారితో పరిచయం అయింది. అందరూ కలిసి రోజు మద్యం తాగేవారు. గత కొద్ది రోజులుగా సంతపేటలోని అబ్దుల్‌ రహీం చికెన్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం తాగారు. తన పాతస్నేహితులు వస్తున్నారని వారిని కలిసేందుకు వెళుతున్నాని చెప్పి వెళ్లిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి వినాయక థియేటర్‌ సమీపంలోని ఆర్‌ఎస్‌ మొబైల్స్‌ దుకాణం వద్ద  ఖుద్దూస్‌ దారుణ హత్యకు గురైయ్యాడు. స్థానికులు గుర్తించి శనివారం మూడో నగర పోలీసులకు సమాచారం అందించారు.

నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మూడో నగర ఇన్‌స్పెక్టర్‌ బి. పాపారావు, ఎస్సైలు వెంకటేశ్వరరాజు, సుభాన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణం బయట ఉన్న గోడకు తలను బలంగా మోది, అనంతరం నాపరాయితో తలపై తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన తీరును బట్టి మద్యం మత్తులో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్య ఒక్కరు చేశారా లేదా వ్యక్తులు కలిసిచేశారా? హత్యకు కుటుంబ కలహాలా మరే ఇతర కారణమా అనే కోణంలో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. హత్య విషయంపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీసి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ హత్యకేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మృతుడి భార్య, పిల్లలకు సమాచారం అందించారు. వారు నెల్లూరుకు చేరుకున్నారు. 

Advertisement
Advertisement