Sakshi News home page

దేశంలో వర్గ పోరు

Published Thu, May 14 2015 2:52 AM

Communal fight in the country

సాక్షి ప్రతినిధి, గుంటూరు : స్థానిక ఎమ్మెల్సీ సీటు కోసం దేశం తమ్ముళ్లు మధ్య వర్గపోరుకు తెరలేచింది. ఈ ఎన్నికల్లోనైనా పనిచేసిన వారికి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మొన్నటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఆప్కాబ్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో అధినేత చంద్రబాబు మాట తప్పారని, ఈసారైనా పనిచేసిన వారిని గుర్తించాలని ఆశావహులు కోరుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తూ బయోడేటాలను ఇస్తున్నారు. సామాజిక వర్గం, పార్టీలోని సీనియార్టీలను పరిగణనలోకి తీసు కోవాలని  కోరుతున్నారు.
 
మొన్నటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏఎస్ రామకృష్ణకు సీటు కేటాయించగా, ఈ సారీ అదే సామాజిక వర్గం నుంచి పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మిగిలిన సామాజిక వర్గాల ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పలుకుబడి, ధనబలం కలిగిన వారికి అధినేత ప్రాధాన్యం ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని కాపు, మైనార్టీ, వెనుకబడిన వర్గాల ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన ఆశావహులు జిల్లాలోని శాసనసభ్యులు, మంత్రులను కలిసి ఈసారి తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని గణాంకాలతో కూడిన వివరాలను అందజేస్తున్నారు. ఆ సామాజిక వర్గం అభ్యర్థులకు ఇతర జిల్లాల్లో అవకాశం కల్పించాలని కోరు తున్నారు. వీరంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ కన్వీనర్ జీవీ ఆంజనేయులుతోపాటు ఇతర సీనియర్లను కలుస్తున్నారు. పార్టీకి అందించిన సేవలు, ఎన్నిక ఖర్చులకు సమకూర్చుకున్న నిధులు తదితర వివరాలను తెలియచేస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేల్లోనూ గ్రూపులు ఉండటంతో ఒకో గ్రూపు ఒకో సామాజిక వర్గాన్ని భుజాన వేసుకుంటుంది. అవకాశం దొరికినప్పుడు అధినేత చంద్రబాబుకు అభ్యర్థుల గుణగణాలను వెల్లడిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉండాలని చెబుతున్నారు. అయితే సొంత నెట్‌వర్క్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏ వర్గానికి ప్రాధాన్యం ఇస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement