ఏయూ బంద్ ప్రశాంతం.. సంపూర్ణం | Sakshi
Sakshi News home page

ఏయూ బంద్ ప్రశాంతం.. సంపూర్ణం

Published Thu, Oct 1 2015 12:36 AM

ఏయూ బంద్  ప్రశాంతం.. సంపూర్ణం

స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు
ఆరుగురు విద్యార్థి నేతల  అరెస్టు
దశలవారీ ఆందోళన కొనసాగిస్తా మన్న విద్యార్థి సంఘాలు

 
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హక్కు కోసం గళం విప్పిన ఏయూ ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులుకు విద్యార్థి లోకం బాసటగా నిలిచింది. వారిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై మండిపడింది. ప్రభు త్వ, ఏయూ ఉన్నతాధికారుల చర్యలకు నిరసనంగా ఏయూ బంద్ ను బుధవారం సంపూర్ణంగా, ప్ర శాంతంగా నిర్వహిం చింది. ప్రభుత్వం పోలీసులను మోహరించి బంద్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిం చింది. అరెస్టులతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. కానీ విద్యార్థులు స్వచ్ఛం దంగా స్పందించి బంద్‌ను విజయవంతం చేశారు.  దశలవారీగా తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బంద్ ప్రశాంతం: ప్రొఫెసర్లపై కక్షసాధింపు చర్యలకు నిరసనగా ఏయూ బంద్ బుధవారం ప్రశాం తంగా  జరిగింది. బుధవారం ఉదయం 10గంటలకే ఇంజినీరింగ్ కాలేజీ  విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తరగతులను బహిష్కరించారు.  అన్ని విభాగాల విద్యార్థులు   ప్రొఫెసర్లకు సంఘీభావం ప్రకటించారు. తరగతులకు హాజరు కాలేదు.  ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు కొందరు మాత్రమే తరగతులకు హాజరయ్యారు. బంద్‌కు సహకరించాల్సిందిగా విద్యార్థి సంఘాల నేతలు వారిని కోరారు. సానుకూలంగా స్పందించిన విద్యార్థులు తరగతుల నుంచి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను విద్యార్థులు నిరసించారు.  ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెబుతూ అందుకోసం పోరాటం కొనసాగిస్తామని నినదించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన యువభేరీ సదస్సులో ప్రొఫెసర్లు పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేక చర్య ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. యూజీసీ నిబంధనలను అతిక్రమించని ప్రొఫెసర్లపై ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఉన్నతాధికారుల ద్వారా వారికి నోటీసులు జారీ చేయించిందని ఆరోపించారు.

అడ్డుకునేందుకు ప్రభుత్వ యత్నం
 బంద్‌ను విఫలం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం ఉదయం నుంచే పోలీసులు ఏయూ క్యాంపస్‌లో మోహరించారు. హాస్టళ్లకు వెళ్లి మరీ విద్యార్థులను సున్నితంగా బెదిరించినట్లు తెలిసింది.  ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. తాము ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. విద్యార్థి సంఘాల నేతలు కాంతారావు, చంద్రశేఖర్, ధీరజ్, జోగారావు, కల్యాణ్, స్వామిలను అరెస్టు చేసి  త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ  సమన్వయకర్తలు వంశీకృష్ణ, తిప్పల నాగిరెడ్డి, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, హనోక్, రవిరెడ్డి తదితరులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విద్యార్థి నేతలకు సంఘీభావం ప్రకటించారు. సీఐ వెంకటరావుతో మాట్లాడారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు విడిచిపెట్టారు.

ఆందోళన కొనసాగిస్తాం: విద్యార్థి సంఘాలు
 బంద్‌తో ఆందోళనను విరమించేది విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఇద్దరు ప్రొఫెసర్లపై చర్యలను నిరసిస్తూ దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి సృ్మతి ఇరానీలకు పోస్టుకార్టులు, ఎస్‌ఎంఎఎస్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ వాణిని వినిపించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతూ ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్న తీరును కూడా వివరించనున్నారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్రం ఇచ్చిన హామీయే కాబట్టి దాని కోసం మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం కాదని కూడా విన్నవించనున్నారు. ఈ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement