ముంపు గ్రామాలపై దృష్టి పెట్టండి: సీఎం | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామాలపై దృష్టి పెట్టండి: సీఎం

Published Thu, Nov 28 2013 1:39 AM

concentrate on low level villages, says kiran kumar reddy

సాక్షి, హైదరాబాద్: లెహర్ తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో తుపానుపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 27,000 మందిని తరలించామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. 61 మండలాల్లోని 763 ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

కోస్తా జిల్లాలకు ప్రత్యేక అధికారులు: సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు వీలుగా కోస్తా జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను  నియమించింది. కృష్ణాకు బి.ఆర్.మీనా, తూర్పుగోదావరికి రవిచంద్ర, పశ్చిమగోదావరికి సంజయ్‌జాజు, గుంటూరుకు వెంకటేశం, విశాఖకు హర్‌ప్రీత్‌సింగ్, విజయనగరానికి రజత్‌కుమార్, శ్రీకాకుళానికి జి.వెంకట్రామ్‌రెడ్డి, నెల్లూరుకు రాజశేఖర్, ప్రకాశం జిల్లాకు కృష్ణబాబులను నియమించారు.

సహాయక కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు: తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, అవసరమైనన్ని బస్సులను జిల్లా అధికారుల సూచనల మేరకు నడపాలని ఆర్టీసీ అధికారులను సంస్థ ఎండీ ఎ.కె.ఖాన్ ఆదేశించారు.

Advertisement
Advertisement