ఈ ప్రయాణం సురక్షితమా? | Sakshi
Sakshi News home page

ఈ ప్రయాణం సురక్షితమా?

Published Fri, Mar 9 2018 12:19 PM

Conductors Shortage In APSRTC - Sakshi

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అంటూ ప్రకటనలు గుప్పించే యాజమాన్యం ఆచరణలో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా ఒకరికే డ్రైవర్, కండక్టర్‌ బాధ్యతలు అప్పగిస్తూ అధిక భారం మోపుతోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చవలసిన గురుతర బాధ్యత ఉన్న డ్రైవర్లపై ఇలా అదనపు ఒత్తిడి పెంచడం తగదని కార్మిక సంఘాల నాయకులు పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు.

తూర్పుగోదావరి, కొత్తపేట/రావులపాలెం: ఆర్టీసీలో డ్రైవర్‌ బస్సును నడపాలి..కండక్టర్‌ ప్రయాణికులకు టిక్కెట్స్‌ ఇచ్చి డబ్బు వసూలు చేయాలి..అలా ఇద్దరూ ఎవరి డ్యూటీ వారు చేయాలి. కానీ ఎంతోకాలంగా ఒక్కరితోనే అనేక సర్వీసుల్లో డ్యూటీ చేయిస్తున్నారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోల ద్వారా 40 సర్వీసుల్లో ఒక్క డ్రైవరే డ్యూటీ చేస్తుండగా, 80 సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు డ్యూటీ చేస్తున్నారు. ఒకపక్క బస్సును నడుపుతూనే మరోపక్క టిక్కెట్స్‌ ఇచ్చి డబ్బు వసూలు చేయాలి. ఈ విధానం వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండు డ్యూటీలు ఒక్కరే చేస్తున్న సర్వీసులకు అదనపు సమయం కేటాయించకుండా ఇద్దరు ఉన్న సర్వీసులకు ఇచ్చిన సమయమే ఈ సర్వీసులకూ కేటాయిస్తున్నారు. దీంతో నిర్దేశించిన సమయానికి సర్వీస్‌ను గమ్యస్థానానికి చేర్చడంతో పాటు కండక్టర్‌ డ్యూటీ చేయాలి. ఇద్దరు ఉన్న సర్వీసు తిరిగి గమ్యస్థానానికి చేరాక డ్రైవర్‌ బస్సును డిపోలో స్వాధీనం చేస్తారు. కండక్టర్‌ ఎస్‌ఆర్‌తో పాటు టిమ్‌ యంత్రాన్ని, నగదును అప్పగిస్తారు. కానీ ఒక్కరు డ్యూటీ సర్వీసులో రెండు విధులు డ్రైవర్‌ ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో సుమారు రెండు గంటలు అదనంగా పనిచేయాల్సి వస్తోంది.

ప్రమాదకరంగా ప్రయాణం
బస్‌ను ఎంత జాగ్రత్తగా  నడుపుతున్నా.. ఎదుటి వాహన చోదకులు లేదా బాటసారి సక్రమంగా ప్రయాణించకపోతే ప్రమాదం జరుగుతుంది. బస్‌ స్టార్ట్‌ చేసి ఆపే వరకూ డ్రైవర్‌ ముందు రోడ్డుపైన, సైడ్‌ మిర్రర్స్‌ వైపు చూస్తూ ఉండాలి. కానీ రెండు డ్యూటీలు చేస్తున్న డ్రైవర్‌ ఒకవైపు బస్సును నడుపుతూ మరోవైపు టిక్కెట్స్‌ ఇవ్వాలి. డబ్బు తీసుకోవాలి. ప్రయాణికుడు టిక్కెట్‌కు తగిన సొమ్ము కాకుండా పెద్ద నోట్లు ఇస్తే తిరిగి చిల్లర చెల్లించాలి. ఈ తతంగమంతా పూర్తయ్యాక బస్‌ స్టార్ట్‌ చేద్దామంటే సమయం సరిపోదు. దాంతో బస్‌ రన్నింగ్‌లో ఉండగానే రెండు డ్యూటీలు చేస్తున్నారు. ఎవరి డ్యూటీ వారు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీలు భర్తీ చేయాలని కార్మిక సంఘాల నాయకులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రెండు డ్యూటీలతోఅభద్రతా భావం
ఆర్టీసీలో ఒక్కరే డ్రైవర్‌ డ్యూటీతో పాటు కండక్టర్‌ డ్యూటీ కూడా చేయడంతో అభద్రతాభావానికి గురవుతున్నారు. ఆ సర్వీసులకు అదనపు సమయం కూడా కేటాయించడంలేదు. దానితో డ్రైవర్లు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారు. సంస్థ ఖర్చును తగ్గించుకోవడానికి కార్మికులపై ఈ విధంగా భారం పెంచడం మంచిది కాదు. 12 ఏళ్లుగా కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఈ సమస్య  పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. – జి.చిరంజీవి, రీజనల్‌ సెక్రటరీ, ఎంప్లాయీస్‌ యూనియన్, రాజమహేంద్రవరం

Advertisement
Advertisement