అయ్యన్న ఆగ్రహం | Sakshi
Sakshi News home page

అయ్యన్న ఆగ్రహం

Published Sat, Nov 15 2014 1:25 AM

అయ్యన్న ఆగ్రహం - Sakshi

సీఎం కార్యదర్శిపై  సీరియస్
గంటా పెత్తనాన్ని సహించేది లేదని స్పష్టీకరణ
సొంతింట్లోనూ విద్యామంత్రికి  పొగబెట్టే ఎత్తుగడ
పతాక స్థాయికి  మంత్రుల మధ్య విభేదాలు

 
 ‘ఆర్డీవోల బదిలీలు ఆపాలని చెప్పడానికి  ఆయనెవరు?... ఆయన చెబితే ఆపాలని ఆదేశించడానికి మీరెవరు?...పూటకో పార్టీ మారేవారా మా ప్రభుత్వంలో నిర్ణయాలను శాసించేది. ఎట్టి  పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఆ ఆర్డీవోలను జాయిన్ చేసుకోండి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’   జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబు ముఖ్యకార్యదర్శి సతీష్  చంద్రను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు  ఇవి. ఆర్డీవోల బదిలీ వ్యవహారంతో జిల్లా  మంత్రుల మధ్య విభేదాలు మరోసారి  భగ్గుమన్నాయి. ఇక మంత్రి గంటాతో
 తాడోపేడో తేల్చుకోవ డానికే అయ్యన్న సంసిద్ధమయ్యారు.
 
విశాఖపట్నం : వ్యూహత్మకంగా జిల్లాలో మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చి న మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఇక నేరుగా ఢీ అంటే ఢీ అనడానికి ఉ ద్యుక్తమయ్యారు. మరోవైపు గంటా కు సొంత నియోజకవర్గంలోనే ఆయనపై తిరుగుబాటుకు ఆజ్యం పోశారు. తా ను ఇతర జిల్లాల మంత్రులు వ్యూ హా త్మకంగా ఆర్డీవోల బదిలీలు చేయి స్తే మంత్రి గంటా అభ్యంతరం తెలపడా న్ని అయ్యన్న సహించలేకపోయారు. మంత్రి గంటా ఒత్తిడితో సీఎం కార్యాలయ అధికారులు కొత్తగా నియమితులైన ఆర్డీవోలను విధుల్లో చేర్చుకోవద్దని కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో గంటా వర్గం మళ్లీ పెచైయ్యి సాధించిందని అంతా భావించారు. కానీ దీన్ని అయ్యన్న ఏమాత్రం సహించలేకపోయారు. తీవ్రంగా ఆగ్రహించిన ఆయన అదే స్థాయిలో స్పందించారు. కొత్త ఆర్డీవోలను గురువారం విధుల్లో చేర్చుకోకపోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఏకంగా సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో మంత్రి గంటా వ్యవహార శైలిని కూడా సతీష్ చంద్ర వద్ద కడిగిపారేశారు. ‘ఆర్డీవో బదిలీలను నిలిపివేయమనడానికి ఆయనెవరు?... ఆయన చెబితే ఆపేయడానికి మీరెవరు?... ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు వచ్చిన తరువాత వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద లేదా?... మీరే నిర్ణయాలు తీసుకుంటారా?.... అలా అయితే మేమెందుకు?... పూటకోపార్టీ మారేవారి మాటలు విని మమ్మల్ని అవమానపరుస్తారా?’అని తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం.

ఈ వ్యవహారం కాస్త సీఎం కార్యాల యంలో కలకలం సృష్టించింది. ఆ తరు వా ఏమైందో తెలియదు గానీ అనకాపల్లి ఆర్డీవోగా నియమితులైన బి.పద్మావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించ డం గమనార్హం. మంత్రి గంటా, పెందు ర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి తదితరులు తీవ్రంగా వ్యతిరేకత ను బేఖాతరు చేస్తూ ఉన్నతాధికారులు ఆమె జాయినింగ్‌కు పచ్చజెండా ఊపా రు. కాగా విశాఖపట్నం ఆర్డీవోగా నియమితులైన రామచంద్రారెడ్డి మాత్రం ఇం కా విధుల్లో చేరకపోవడం గమనార్హం.

గంటాకు సొంతింట్లోనే పొగ

ఓ వైపు జిల్లాలో మంత్రి గంటా మాటకు విలువలేకుండా చేస్తూనే మరోవైపు ఆయనకు సొంతింట్లోనే పొగబెట్టడానికి అయ్యన్న వర్గం పావులు కదుపుతోంది. భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గంటా నియోజకవర్గాన్ని పట్టిం చుకోవడం లేదని ఆ మండలంలోని టీడీపీ నేతలు శుక్రవారం అసమ్మతి జెండా ఎగురవేశారు. మంత్రి తీరుకు నిరసగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి అయ్యన్న వర్గం హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిణామాలతో జిల్లాలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నట్లే! దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Advertisement
Advertisement