టీఆర్‌ఎస్ విలీనంపై కాంగ్రెస్ దృష్టి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ విలీనంపై కాంగ్రెస్ దృష్టి

Published Thu, Nov 7 2013 1:08 AM

Congress eyes on merger of TRS

11న ఢిల్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజన ప్రక్రియపై వేగంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) విలీనంపైన కూడా దృష్టి సారించినట్టు చెబుతున్నారు. తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర పడితే పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టంచేశారు. అయితే టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అంశంపై ఇప్పటివరకు ఇరు పార్టీల మధ్య ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన అవగాహనతో ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్‌ఎస్ విలీన అంశంపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం విలీన ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేసినట్టు జీవోఎంలోని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులను మానసికంగా సమాయాత్తం చేయడానికే విలీన అంశం తెరపైకి తెస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, అధికారికంగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 11వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 12న జీవోఎం ముందు హాజరై 10 జిల్లాలతో కూడిన తెలంగాణపై తన అభిప్రాయాన్ని వినిపిస్తారని తెలుస్తోంది. అయితే ఢిల్లీలో జరిగే పరిణామాల ఆధారంగా కేసీఆర్ ఏఐసీసీలోని ముఖ్యులతో చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement
Advertisement