టీడీపీకీ స్నేహ‘హస్తం’ | Sakshi
Sakshi News home page

టీడీపీకీ స్నేహ‘హస్తం’

Published Mon, Nov 25 2013 2:50 AM

Congress failed to net

అసంతృప్తులకు కాంగ్రెస్ వల
 =రంగంలోకి మంత్రి బస్వరాజు సారయ్య
 =స్థానిక నేతల్లో అసంతృప్తి

 
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకులకు కాంగ్రెస్ స్నేహ హస్తం అందిస్తోంది. ఆ పార్టీలోని అసంతృప్తులకు వల విసురుతోంది. టీడీపీలో ఉన్న అసమ్మతిని ఆసరా చేసుకుని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు స్వయంగా మంత్రి బస్వరాజు సారయ్య రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో టీడీపీ వైఖరిపై విసిగిపోయిన ఆ పార్టీలోరి పలువురు నాయకులను తమవైపు తిప్పుకునే దిశగా సాగుతున్నారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఇటీవల టీడీపీ మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన, పార్టీ నాయకుడు నాగపురి సంజయ్ దంపతులతోపాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మరి కొందరు నాయకులు సైతం మంత్రి సారయ్యతో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే టీడీపీ ఖాళీ కాగా... మిగిలిన కొందరిని తమ వైపు తిప్పుకునేందుకు సైతం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికీ... నగరంపై కోల్పోయిన పట్టును సాధించేందుకు  యత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డివిజన్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
 
టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టే దిశగా...
        
 మూడున్నరేళ్లుగా డివిజన్ స్థాయిలో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని, ఎన్నికల సమయంలో శ్రమించిన వారికి సైతం కనీస గుర్తింపు దక్కలేదని పలువురు బాహాటంగానే ఆరోపణలకు దిగారు. పార్టీకి దూరమైన నాయకులు తమ అనుచరవర్గానికే పరిమితమై కార్యకలాపాలు నిర్వహించారు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పార్టీ నేతల్లో గ్రూపులు, అంతర్గత విభేదాల కారణంగా శ్రేణుల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. టీఆర్‌ఎస్ వైపు వెళ్లకుండా చెక్ పెట్టే దిశగా సాగుతున్నారు.  తెలంగాణ ఇస్తున్న పార్టీగా రానున్న రోజుల్లో భవిష్యత్ ఉంటుందనే భరోసాను వారిలో కల్పిస్తున్నారు.
 
స్థానిక లీడర్లలో వ్యతిరేకత

కాంగ్రెస్ నేతలు ఇతర పక్షాలకు వలవేస్తుండడంపై సొంత పార్టీలోని స్థానిక లీడర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లుగా కష్టనష్టాలకోర్చి తాము పార్టీ కోసం పనిచేశామని, ఇంతకాలం ఇతర పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన వారు ఆధిపత్యం చెలాయిస్తే తామెలా సహిస్తామని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరే మళ్లీ టికెట్‌లు ఆశించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న గ్రూపు విభేదాలు మరింత పెరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.
 

Advertisement
Advertisement