‘చే’జారుతున్నారు! | Sakshi
Sakshi News home page

‘చే’జారుతున్నారు!

Published Mon, Sep 16 2013 1:33 AM

Congress leaders bosses

సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన జరగదంటూ మొన్నటివరకు బీరాలు పలికిన మంత్రి పార్థసారథి, ఎంపీ లగడపాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో కంగుతిన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో పాలుపోక ఇన్నాళ్లూ మొహం చాటేస్తూ వచ్చారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన జనోద్యమం ఇప్పుడు మహోద్యమంగా రూపుదాల్చడంతో పరిస్థితి ‘చెయ్యి’ దాటిపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలో పార్టీని చక్కదిద్దుకునే చర్యలకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈడ్పుగల్లులో జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

 కార్యకర్తల వలసలపై భయం..

 ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ సీపీ హవా నడుస్తోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో దీక్ష చేయడం, ఆ తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులోనే దీక్షబూనడం, ఇప్పుడు షర్మిల బస్సుయాత్ర చేస్తుండడంతో సమైక్యవాదులు ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడక అవుతుందని భావిస్తున్న నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగి కేడర్ ‘చే’జారిపోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, అందుకే సమావేశం నిర్వహించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది.

 రాజీనామాలు చేయకుండానే..

 ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఏపీఎన్జీవోలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.  ఎంపీ  రాజగోపాల్, మంత్రి కేపీ సారథి రాజీనామాలు చేయలేదు. ఎమ్మెల్యేలు మాత్రం మొక్కుబడిగా రాజీనామా లేఖలు సీఎంకు పంపి చేతులు దులుపుకొన్నారు. తాము ఉద్యోగాల్ని వదిలి ఉద్యమం చేస్తుంటే.. మరో ఆరు నెలల్లో ఊడిపోయే పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న ప్రజాప్రతినిధులపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎవరూ తమ పదవుల్ని త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించకపోవడం గమనార్హం.

 సోనియాను విమర్శిస్తే ఎదురుదాడే..

 రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్‌కే అంటగట్టడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల బాధ్యత కూడా ఉందంటూ  గొంతు చించుకుని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల తమ పార్టీ నష్టపోయి, ఇతర పార్టీలు లబ్ధిపొందడాన్ని కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సోనియాగాంధీపై ఎవరైనా కామెంట్ చేస్తే వారి పీక నొక్కేందుకు కూడా వెనుకాడబోమంటూ మంత్రి సారథి స్వయంగా ప్రకటించడం గమనార్హం. అసలు రాష్ట్ర విభజన నిర్ణయంలో  సోనియా, సీడబ్ల్యూసీలోని సభ్యులే  కీలకపాత్ర పోషించారనే విషయాన్ని వారు మరిచిపోతున్నారు.

తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలో కాంగ్రెస్ పార్టీని, సోనియా, రాహుల్‌గాంధీలను  తీవ్రంగా ఆక్షే పించిన చంద్రబాబునాయుడుపై ఈ వేదిక ద్వారా ఎదురు దాడి చేయడంలో నేతలు కొంతమేర విజయం సాధించారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీని మొద్దబాయ్ అంటూ చంద్రబాబు అవహేళన చేయగా, మరి లోకేష్ సంగతి ఏంటో చెప్పాలంటూ  పలువురు సీనియర్ నేతలు ప్రశ్నించారు. మంత్రి సారథి  మరో అడుగు ముందుకేసి రాహుల్, లోకేష్‌లను బెంజిసర్కిల్‌లో నిలబెడితే ఎవరు మొద్దబ్బాయో తేలిపోతుందంటూ సవాల్ విసిరారు.

 కార్యకర్తల నుంచి స్పందన నిల్!

 చాలా రోజుల తర్వాత జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి కార్యకర్తల నుంచి స్పందన కరవైంది. వారి హాజరు తక్కువగా ఉండటంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. గంటసేపు కూడా జరగకముందే కార్యకర్తలు వెళ్లిపోసాగారు. చివరికి తమ ప్రసంగాలు పూర్తికాగానే మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్యేలు యలమంచిలి రవి వెళ్లిపోయేందుకు వేదిక దిగారు. మంత్రి సారథి జోక్యం చేసుకుని.. నేతలే వెళ్లిపోతుంటే కార్యకర్తలు మాత్రం ఎందుకు ఉంటారని, నాయకులు సమావేశం అయ్యే వరకు ఉండాలని కోరారు. ఆయన సూచనను నాయకులు పెడచెవిన పెట్టి కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం గమనార్హం.
 

Advertisement
Advertisement