సీఎం కిరణ్‌పై సొంత పార్టీ నేతల ఫైర్ | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్‌పై సొంత పార్టీ నేతల ఫైర్

Published Sat, Aug 10 2013 12:18 AM

congress leaders  fire on C M kiran kumar reddy

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర విభజనతో తెలంగాణ ఏర్పడితే సమస్యలు వస్తాయంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అపరిపక్వ మనస్తత్వంతో కిరణ్ రాష్ట్ర విభజనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి సీఎం కట్టుబడి ఉండాల్సిందేనంటూ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హైదరాబాద్ మీట్ ది ప్రెస్‌లో సీఎం వైఖరిని ఎండగట్టారు. సీఎం వ్యాఖ్యలపై శుక్రవారం జరిగే ప్రెస్‌మీట్‌లో స్పందిస్తానని మంత్రి గీతారెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం నుంచి సమైక్యవాదం వినిపిస్తున్న ఏకైక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
 
 సంయమనం పాటిద్దాం
 ఎవరేం వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ప్రజలు, నాయకులు సంయమనం పాటించాలి. రాష్ట్ర ఏర్పాటు, పునర్మిర్మాణంపై దృష్టి సారిద్దాం. ఎవరో ఏదో మాట్లాడారని అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున ఏ ప్రాంతం వారికీ నష్టం ఉండదు.
 - సునీతా లక్ష్మారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
 
 పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందే!
 సుదీర్ఘకాలంగా నలుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఏర్పాటుకు ప్రాం తాలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకరించాలి. కిరణ్ రాష్ట్రం మొత్తానికి సీఎం అనే విషయాన్ని గుర్తించి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
 - సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్
 
  సీఎం వ్యాఖ్యలు విడ్డూరం
 సీఎం కిరణ్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రిననే విషయాన్ని గ్రహించాలి. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానంటూ ప్రకటనలు ఇచ్చిన సీఎం కిరణ్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారు. నా చేతిలో ఏమీ లేదంటూనే సీమాంధ్ర ప్రతినిధిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం.
 - టి. నర్సారెడ్డి, ఎమ్మెల్యే, గజ్వేల్
 
  సీఎం వ్యాఖ్యలు విడ్డూరం
 సీఎం కిరణ్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రిననే విషయాన్ని గ్రహించాలి. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానంటూ ప్రకటనలు ఇచ్చిన సీఎం కిరణ్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారు. నా చేతిలో ఏమీ లేదంటూనే సీమాంధ్ర ప్రతినిధిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం.
 - టి. నర్సారెడ్డి, ఎమ్మెల్యే, గజ్వేల్
 
 మనోభావాలు దెబ్బతీసేలా మాటలు
 ముఖ్యమంత్రి కిరణ్ ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నా రు. దివంగత సీఎం వైఎస్, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హయాంలో ఇలాం టి అంశాలు ప్రస్తావనకు వచ్చి నా ఎన్నడూ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడలేదు. కిరణ్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సీమాంధ్ర ప్రతినిధిగా వ్యవహరించారు.  సీఎం వైఖరిని ఖండిస్తున్నాం.
 - టి. నందీశ్వర్‌గౌడ్, ఎమ్మెల్యే, పటాన్‌చెరు
 
 సీఎం తీరు సరికాదు
 మూడేళ్లుగా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. సీఎం వ్యాఖ్యలతో మా మనసు గాయపడింది.
 - పి. కిష్టారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్

Advertisement
Advertisement